దసరాకు కేసీఆర్ మేనిఫెస్టో.. ఏమేం ఉంటాయంటే

జాతీయ రాజకీయాలలో అంతుచిక్కని వ్యూహాలతో వెళ్తున్న బీఆర్ఎస్ నేత లోక్ సభ ఎన్నికల కోసం చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని రాజకీయ అనుభవజ్ఞులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరుపుతూ మేనిఫెస్టో రూపకల్పన పనిలో ఆయన బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో స్ట్రక్చర్ ఎలా ఉండాలనే విషయంలో క్లారిటీతో ఉన్న కేసీఆర్.. అందులో ఏమేం ఉండాలనే విషయంలో వర్క్ చేయిస్తున్నారట. తెలంగాణలో పెద్ద పండగగా భావించే దసరా రోజున బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసేలా ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు.

జాతీయ అజెండాతో ఒక మేనిఫెస్టో, రాష్ట్రం కోసం మరో మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తెలంగాణ మినహా పోటీ చేయాలనుకుంటున్న అన్ని రాష్ట్రాలకు నేషనల్‌ మేనిఫెస్టో వర్తించేలా నిపుణులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాభై మందికి పైబడిన నిపుణుల బృందం ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా కొత్త ఓటర్లను ఆకర్షించడంపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 27న తెలంగాణ భవన్‌లో జరుగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అజెండాలో ఎన్నికల ప్రణాళిక రూపకల్పన అంశమే అత్యంత కీలకమైనదని చెప్తున్నారు.

ఈసారి 100 అసెంబ్లీ స్థానాలు గెలిచి, హ్యాట్రిక్‌ విజయం సాధించడం అనేది ప్రధాన లక్ష్యంగా జరగనున్న ఈ ప్లీనరీలో అనేక అంశాలు చర్చించనున్నారు. అదనంగా పార్టీ నాయకత్వం ప్లీనరీకి ముందే ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలపై అధ్యయనం చేస్తోంది. పని చేయని శాసనసభ్యులకు వారి మార్గం మార్చడానికి చివరి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ యోచిస్తున్న తరుణంలో అక్టోబర్‌లోగా పనితీరు మెరుగుపడకుంటే పార్టీ ప్రత్యామ్నాయ అభ్యర్థుల కోసం చూడాల్సి వస్తుందని బీఆర్‌ఎస్‌ నాయకత్వం స్పష్టమైన సందేశం పంపుతుందని పార్టీ అంతర్గత వర్గాల నుంచి తెలుస్తోంది.