ఎన్నికల కోసం హెలికాప్టర్లే తీసేసుకున్నారు

చూస్తుంటే దేశంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్నాటక ఎన్నికలే నిలుస్తాయేమో. ఎందుకంటే కన్నడ పార్టీల్లో డబ్బుకు కొదవలేని పార్టీలు దాదాపు లేవు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్, గాలి పార్టీ అన్న తేడా లేకుండా చాలామంది అభ్యర్ధులు వేల కోట్ల రూపాయల ఆస్తులు, వ్యాపారాలున్నవారే. కాబట్టి ఎన్నికల్లో వందల కోట్ల రూపాయల ఖర్చులన్నది వీళ్ళకు అసలు లెక్కే కాదు. ఎన్నికల కమీషన్ పరిమితి కన్నడ నాట ఎందుకు పనికిరాదు.

ఇపుడు విషయం ఏమిటంటే పోలింగ్ మే 10వ తేదీకి ఎంతో దూరంలేదు. అందుకనే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలంటే రోడ్డుమార్గాన వెళితే టైం సరిపోదు. అందుకనే అన్నీ పార్టీలు గాలి మార్గాన్నే ఎంచుకున్నాయట. అన్నీ పార్టీలు కలిపి ఇప్పటికి సుమారు 200 వరకు హెలికాప్టర్లు, విమానాలను అద్దెకు తీసుకున్నాయట. హెలికాప్టర్లు, చిన్నపాటి విమానాలు కర్నాటకలోనే 100 దాకా ఉన్నాయి. అయితే ఇవి సరిపోవని ముంబాయ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, కోల్ కత్తా, కొచ్చిన్లో ఉన్న కంపెనీలకు చెందిన హెలికాప్టర్లు, విమానాలను కూడా బుక్ చేసేసుకున్నాయట.

అద్దె ఎంతైనా పర్వాలేదు ముందు హెలికాప్టర్, విమనాలను పంపించమని నేతలు అడ్వాన్సులు కూడా చెల్లించేస్తున్నారట. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నెలముందే చాలామంది హెలికాప్టర్లు, విమానాలను అడ్వాన్స్ బుక్ చేసేసుకున్నారట మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని. రెండుసీట్ల హెలికాప్టర్ కు జీఎస్టీ తో కలిపి గంటకు అద్దె రు. 2.10 లక్షలు. 4 సీట్ల హెలికాప్టర్ అద్దె రు. 2.30 లక్షలు. 6 సీట్ల హెలికాప్టర్ కు రు. 2.60 లక్షలు అద్దెట. ఇక 8 సీట్ల విమానానికి గంటకు అద్దె రు. 3.5 లక్షలట. 13 సీట్ల విమానానికి అయితే రు. 4 లక్షలు కంపెనీలు వసూలు చేస్తున్నాయట.

2018 ఎన్నికల్లో కూడా హెలికాప్టర్లు, విమానాలను పార్టీలు, నేతలు ఇలాగే అద్దెకు తీసుకున్నాయట. హెలికాప్టర్ల వినియోగానికి అనుమతి కావాలని ఇపుడు 82 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది. అంటే ఎన్నికల్లో గెలుపు ముందు వందల కోట్ల రూపాయల ఖర్చు అసలు ఖర్చే కాదన్నట్లుగా పార్టీలు, నేతలు వ్యవహరిస్తున్నట్లు అర్ధమైపోయింది.