మనమడు అన్న తర్వాత ఆ మాత్రం ప్రేమ ఉండదా?

అవును.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రం.. ఆ మనమడికి తాతేగా. సీఎంగా ఆయన చాలానే కార్యక్రమాలకు.. విషాదాల వేళ పరామర్శలకు బయటకు రావటానికి ఇష్టపడని ఆయన.. తన ప్రియాతి ప్రియమైన మనమడి ప్లస్ టూ పాస్ అయిన సందర్భంగా జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటమా? మనమడు సాధించిన విజయాన్ని స్వయంగా చూసి సంతసించే అవకాశాన్ని ఆయన ఎందుకు పోగొట్టుకుంటారు. అందుకే.. తీరిక లేనట్లుగా ఉండే బిజీగా షెడ్యూల్ ను పక్కన పెట్టేసి.. తన మనమడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి స్వయంగా హాజరైన కేసీఆర్ ను చూసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే తాత పాత్రకే నూటికి నూరుశాతం న్యాయం చేస్తున్నారని చెప్పక తప్పదు.

గచ్చిబౌలిలోని ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న కేసీఆర్ మనమడు హిమాన్షురావు 12వ తరగతి పూర్తి చేసి పట్టా అందుకున్నారు. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డును అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన సతీమణిశోభమ్మ.. కొడుకు కేటీఆర్.. ఆయన సతీమణి.. కుమార్తె.. ఇలా మొత్తం కుటుంబం ఈ వేడుకను చూసేందుకు హాజరయ్యారు.