జనసేన అధినేత పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. ఆయనకు ఉన్న ఫాలోవర్లను బట్టి.. ఆ వ్యాఖ్యలకు జోష్ పెరుగుతోంది. ఏపీలో అప్పుడప్పుడే.. ఆయన పర్యటనలు చేస్తున్నా.. పవన్ చేస్తున్న కామెంట్లు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే.. రోజుల తరబడి ఆయా వ్యాఖ్యలు ప్రతిధ్వనిస్తున్నాయి. దీంతో పవన్ ఎక్కడ ఎప్పుడు ఏం మాట్టాడినా.. ప్రధాన స్రవంతిలో కీలక టాపిక్ అవుతోంది.
ఇక, తాజాగా పవన్ కళ్యాణ్.. విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో తెలంగాణ మంత్రులు-ఏపీ మంత్రులు-తెలుగు ప్రజల అంశాన్ని ప్రస్తావించారు. నాయకులు-నాయకులు కామెంట్లు చేసుకోండి.. కానీ, మధ్యలో ప్రజలపైనా.. సమాజంపైనా ఎందుకు కామెంట్లు చేస్తారని పవన్ ప్రశ్నించారు. ఇది తగదని హితవు పలికారు. ఏపీ మంత్రులకు దాదాపు వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు.
ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. నాయకులు నాయకులు తిట్టుకోవడం రాజకీయాల్లో కామనే కాబట్టి.. వారి ఇష్టానికి వదిలేయాల్సిందే. ఇక, ఈ సమయంలో సమాజాన్ని, ప్రజలను తిట్టడాన్ని ఎవరూ హర్షించరు ఇంత వరకు పవన్ చేసింది కరెక్టే. కానీ, చివరలోనే వడ్డించిన విస్తరిలో ఉమ్మేసినట్టు.. తెలంగాణ ప్రజల కు ఏపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని అనడం పవన్ ఇంత కష్టం కూడా వివాదాలకు దారితీసేలా చేసింది.
పవన్‌పై వైసీపీనేత పేర్ని నాని నుంచి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు వరకు అందరూ విరుచుకుప డ్డారు. ఇక, తరచుగా పవన్‌ను సమర్ధించే టీడీపీ నాయకులు.. మౌనంగా ఉండిపోయారు. మరోవైపు.. బీజేపీ నేతలు.. అంటే.. పవన్‌తో పొత్తులో ఉన్న బీజేపీ నాయకులు ఏమీ మాట్లాడడం లేదు. అంటే.. మొత్తంగా పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు ఇప్పుడు మైలేజీ రాకపోగా.. మైనస్ వచ్చిందనే వాదన వినిపిస్తోంది. మరి ఇకమీదటైనా.. ఆయన తాను వైసీపీ నేతలకు చెప్పినట్టు వ్యవహరిస్తారో లేదో చూడాలి.