వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుత మంత్రి, పొలిటికల్‌గా సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు.. ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. మహిళలుఎందుకు ఓటేయరని.. పథకాలు ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నవారు ఓటు మాత్రం వేరే వారికి వేస్తారా? అని నిలదీసిన విషయం రాజకీయంగా సంచలనం అయింది. ఇక ఈ పరంపరలో మంత్రి ధర్మాన మరోసారి వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తామని ఓటర్లతో దేవుడిపై ఒట్టు వేయించాలని ఆయన వలంటీర్లు.. గృహ సారథులకు ఆదేశాలు జారీ చేశారు. ‘వైసీపీకి ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు మనకే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని పటంపై వారితో ఒట్టు వేయించండి’ అని ధర్మాన ప్రసాదరావు వలంటీర్లకు సూచించారు. శ్రీకాకుళం టౌన్‌హాల్లో వలంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది.
‘ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది గుర్తించాలి. ఇందుకు మూడు పద్ధతులు అనుసరించాలి. ఏ, బీ, సీలుగా విభజించి.. ఏలో వైసీపీకి వేసేవారిని, బీలో వైసీపీకి ఓటు వేయనివారిని, సీలో గోడమీద పిల్లిలాంటి వారిని గుర్తించాలి. టీడీపీకి ఓటువేసే ఒక్క కుటుంబాన్నయినా వైసీపీ వైపు వలంటీర్లు తిప్పగలిగితే వేలల్లో ఓట్లు మనకు పడతాయి.’ అని ధర్మాన దిశానిర్దేశం.
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు వస్తే పథకాలు ఇవ్వరనే బలహీనతపై ప్రజలను దెబ్బ కొట్టాలన్నారు. దూరప్రాంతాలకు వెళ్లిపోయిన వైసీపీ ఓటర్లను గుర్తించి వారి చిరునామాలు సేకరించాలన్నారు. ఎవరైనా వినకపోతే కుటుంబపెద్దలను కలిసి మాట్లాడాలన్నారు. కులపెద్దలతో మాట్లాడించాలని సూచించారు. ఓట్ల సేకరణకు తుపాకీ పట్టిన సైనికుడిలా యుద్ధానికి సిద్ధం కావాలని తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates