ఏపీలోని వైసీపీ మంత్రులు, నాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు.. మంత్రులు, నాయకులు నోరు జారి మాట్లాడితే.. దానిని అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్‌పై ఉంటుందని పార్టీ పెద్దలపైనా ఉంటుంద ని అన్నారు. నాయకులు-నాయకులు తిట్టుకునే సమయంలో ప్రజలను రోడ్డుమీదకు లాగడం సరికాదన్నారు.
ఒక సమాజాన్ని, ప్రజలను విమర్శించడం సరికాదని పవన్ సూచించారు. ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల మంత్రుల మధ్య జరిగిన సంభాషణలను ఆయన ప్రస్తావించారు. విశాఖ ఉక్కు విషయంలో బిడ్ వేస్తా మంటూ.. తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడం.. దీనికి కౌంటర్‌గా ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు, మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రియాక్ట్ అయ్యారు. అయితే..ఈ సమయంలో సీదిరి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి.
తెలంగాణ ప్రజలకు బుర్రలేదని, ఏపీ ప్రజలు తెలంగాణలో నివసించకపోతే.. అక్కడకు రాకపోతే.. తెలంగాణ అడుక్కు తినాలని ఏపీ మంత్రి సీదిరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా పవన్ రియాక్ట్ అవుతూ.. నాయకులు చేసుకునే విమర్శలకు.. ప్రజలను జోడించడం సరికాదన్నారు. నాయకులు నాయకులు ఎన్నయినా తిట్టు కోవచ్చని.. కానీ, ఒక సమాజాన్ని విమర్శించడం ఏమేరకు సబబని ప్రశ్నించారు.
అది ఆంధ్రా అయినా.. తెలంగాణ అయినా.. ప్రజలను.. నాయకులు చేసే విమర్శలు దూరంగా ఉంచాల ని పవన్ సూచించారు. తెలంగాణ ఏపీలో మంత్రులు, వైసీపీ నాయకులకు వ్యాపారాలు లేవా? ఇక్కడ నివాసాలు లేవా? అని పవన్ ప్రశ్నించారు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని పవన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ నాయకులు నోరు జారితే.. అధిష్టానం అయినా.. దానిని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. ఈ మేరకు పవన్.. సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.