జనసేనకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే నాగబాబు యాక్షన్ లోకి దిగారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఏముందంటే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితీరాలట. పవన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. పవన్ను సీఎం చేయటమే ధ్యేయంగా కార్యకర్తనుండి రాష్ట్ర నేతలవరకు అందరినీ సమన్వయం చేస్తానని ప్రతిజ్ఞచేశారు.
పవన్ లాంటి రాజకీయ నేత ప్రస్తుత వ్యవస్ధలో చాలా అరుదట. సీఎం అయితే ఎవరూ ఊహించనంతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేంత సత్తా, తపన పవన్లో ఉన్నాయని నాగబాబు సర్టిఫికేట్ ఇచ్చేశారు. తొందరలోనే తాను రాష్ట్రమంతా పర్యటించబోతున్నట్లు హామీ ఇచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్న వైసీపీ నేతలకు ఎవరూ భయపడద్దని భరోసా ఇచ్చేశారు. పవన్ సీఎం కావాలని పార్టీతో పాటు యావత్ ప్రజలంతా ఎదురుచూస్తున్నట్లు నాగబాబు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ సీఎం అవ్వాలని పార్టీ నేతలు, ప్రజలు ఎదురుచూస్తున్నారో లేదో తెలీదు. అయితే పవన్ మాత్రం జగన్ దిగాలని మాత్రమే అనుకుంటున్నాడని అందరికీ ఎప్పుడో అర్ధమైపోయింది. పవన్ రాజకీయమంతా సీఎం అవ్వాలని కాదు, జగన్ దింపాలని మాత్రమే అని తెలిసిపోయింది. వైసీపీని ఓడించేందుకు తాను టీడీపీతో పొత్తుపెట్టుకోబోతున్నట్లు స్వయంగా పవనే ప్రకటించారు. టీడీపీతో పొత్తంటే పవన్ కు సీఎం ఛాన్స్ ఎలావస్తుంది ?
ఒంటరిగా పోటీచేసేంత సీన్ తనకు లేదని పవనే చెప్పుకున్నారు. పొత్తు ఉన్నపుడు పెద్ద పార్టీకే సీఎం పదవి దక్కుతుంది… అంటే ఏరకంగా చూసినా పవన్ కు సీఎం అయ్యే అవకాశంలేదని అందరికీ తెలుసు. తాను సీఎం అవ్వాలని పవన్ కే లేనపుడు నాగబాబు ఎందుకు కలలు కంటున్నారు.