నాగబాబుకు పదవితో నాదెండ్లకు కష్టకాలమేనా ?

ఎన్నికల దగ్గర పడుతున్న వేళ జనసేనలో అనూహ్య మార్పు జరిగింది. ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అన్నయ్య నాగబాబును ప్రధాన కార్యదర్శిని చేశారు. ఇప్పటి వరకు ఆయన రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడిగా మాత్రమే ఉండేవారు. ఇప్పటి వరకు లేని ఒక పదవిని సృష్టించి మరీ నాగబాబుకు అప్పగించడంతో పాటు ఆయనకు ఎలివేషన్ ఇచ్చామనే సందేశమిచ్చే ఫోటోను కూడా విడుదల చేశారు.

ఆయనే నెంబర్ 2

జనసేనలో ఇంతకాలం నాదెండ్ల మనోహర్ ను నెంబర్ 2గా పరిగణించేవారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న నాదెండ్ల అన్నీ తానై పార్టీని నడిపించేవారు. జిల్లా పర్యటనలు చేస్తూ చిన్న చిన్న తగవులు తీర్చేవారు. కాకపోతే మనోహర్ పై కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ వారి సూచనలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దానితో మనోహన్ పైన మరో పదవిని తెచ్చి పెడితే ఆయన్ను కంట్రోల్ చేసే వీలుంటుందని పవన్ కల్యాణ్ భావించి ఉండొచ్చు. పైగా నాగబాబు పట్ల పార్టీలో ఓ పెద్ద దిక్కు అన్న గౌరవం కూడా ఉంది. అందుకే ఆయన్ను నెంబర్ 2 ప్లేస్ కు ప్రమోట్ చేశారనుకోవాలి.

నాగబాబుకు రెండు బాధ్యతలు

పవన్ కల్యాణ్ అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరో రెండు నెలల పాటు పవన్ సినిమా షూటింగుల్లో ఉంటారు. దానితో ఇప్పుడు పరోక్షంగా పార్టీ బాధ్యతలన్నీ నాగబాబుపై పెట్టేందుకే ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాగబాబు పార్టీ కేడర్ ను సమన్వయ పరుచుకోవాలి. అది ఆయన ముందున్న పెద్ద ఛాలెంజ్. ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఆశావహుల మధ్య కీచులాట పెరగడం ఖాయం. పైగా పొత్తులు కుదిరిన తర్వాత టికెట్ల పంచాయతీలో గొడవలు జరగొచ్చు. ఇలాంటి సమస్యలను నాగబాబు తీర్చుతారని పవన్ నమ్ముతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం కాలంలోనూ జిల్లాల్లో పర్యటిస్తూ నాగబాబు అన్ని సమస్యలను పరిష్కరించారు.

పార్టీ ఎన్ఆర్ఐ విభాగాన్ని పటిష్టం చేయడం రెండో సమస్య. జనసేనకు ఎన్ఆర్ఐల బలం బాగానే ఉంది. ఇటీవలే నాగబాబు విదేశాల్లో పర్యటించి పలు మీటింగుల్లో మాట్లాడి వచ్చారు. విదేశాల్లో ఉన్న పార్టీ అభిమానులను సంఘటిత పరిచి వచ్చారు. వచ్చే ఎన్నిక్లలో దూరం నుంచే వారు పార్టీ కోసం పనిచేస్తారన్న విశ్వాసంతో నాగబాబు ఇండియా తిరిగొచ్చారు. ఇప్పుడాయన వారి సేవలను ఉపయోగించుకునేందుకు దృష్టి పెట్టబోతున్నారు…