కర్నాటకలో లేటెస్ట్ సర్వేనే నిజమవుతుందా ?

Karnataka
Karnataka

కర్నాటక ఎన్నికలు చాలా హోరా హోరీగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అధికార బీజేపీ మీద జనాల్లో బాగా వ్యతిరేకత కనబడుతోంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మీద జనాల్లో బ్రహ్మాండమనేంతగా సానుకూలత కనబడటంలేదట. కాబట్టి మధ్యలో ఉన్న జేడీఎస్ కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆమధ్య జరిగిన ఒక సర్వేలో 224 అసెంబ్లీల్లో కాంగ్రెస్ కు 127 సీట్లు వస్తాయని తేలింది.

అయితే తాజాగా పీపుల్స్ పల్స్ సంస్ధ నిర్వహించిన సర్వేలో ఏ పార్టీకి కూడా కంఫర్టబుల్ మెజారిటి రాదని తేలిందట. ప్రాపబులిటి ప్రొఫెషనల్ మెథడాలజీ పద్దతిలో 56 నియోజకవర్గాల్లో సర్వే చేసింది. పై నియోజకవర్గాల్లో 5600 శాంపుల్స్ సేకరించింది. కోట్లమంది ఓటర్లున్న రాష్ట్రంలో 5600 శాంపుల్సంటే చాలా తక్కువనే చెప్పాలి. 56 నియోజకవర్గాల్లో 5600 మందిని సర్వేచేశారంటే నియోజకవర్గానికి 100 మందని అర్ధమవుతోంది.

ఇలాంటి సర్వేల వల్ల ఫలితాలు సక్రమంగా వస్తాయని అనుకునేందుకు లేదుకానీ ఓవరాలుగా జనాల నాడి ఎలాగుంది అని చెప్పుకునేందుకు పనికొస్తుందంతే. ఈ పద్దతిలో చూస్తే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటి రాదని అర్ధమవుతోంది. 224 నియోజకవర్గాలున్న కర్నాటకలో ఏ పార్టీ అయినా సొంతంగా అధికారంలోకి రావాలంటే 113 సీట్ల మ్యాజిక్ మార్కును దాటాలి. ఈ లెక్కన కాంగ్రెస్ కు 95-105 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

అలాగే బీజేపీకి 90-100 స్ధానాలు వస్తాయట. జేడీఎస్ కు 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయట. నిజంగానే ఈ సర్వే వాస్తవమైతే కర్నాటకలో 2018లో వచ్చినట్లు మళ్ళీ హంగ్ రావటం ఖాయం. అదే జరిగితే కుమారస్వామే మళ్ళీ ముఖ్యమంత్రయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. తనకు సంపూర్ణ మెజారిటి రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇదే సమయంలో హంగ్ అసెంబ్లీ రావాలని బహుశా కుమారస్వామి కోరుకుంటున్నారేమో. మొత్తంమీద పాలక బీజేపీ పరిస్ధితే అన్యాయంగా తయారైంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు అభ్యర్ధుల ఎంపికలో హిట్ అవుట్ ఆర్ గెటవుట్ అనే పద్దతిలో ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.