ఏపీ అసెంబ్లీ స్పీకర్.. తమ్మినేని సీతారాం విద్యకు సంబంధించిన వివాదం కీలక మలుపు తిరుగుతోంది. చినుకు.. చినుకు.. అనుకున్న విషయం కాస్తా..ఇప్పుడు తీవ్ర గాలివానగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హత విషయంలోనూ.. తీవ్ర రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఏపీ స్పీకర్‌గా ఉన్న తమ్మినేని వంతు వచ్చినట్టు అయింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న తమ్మినేని సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం సొంతం చేసుకున్నారు.
గతంలోనే మంత్రిగా పనిచేశారు. కానీ, ఎప్పుడూ రాని వివాదం ఇటీవల తెరమీదికివచ్చింది. ఆయనే స్వయంగా ఇంటర్ తప్పానని ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ, ఇటీవల మాత్రం తాను డాక్టరేట్ చేస్తున్నట్టు ప్రకటించుకున్నారు. దీంతో టీడీపీ నేతలు.. అసలు ఏం చదివారంటూ.. దృష్టి సారించారు. ఈ క్రమంలో టీడీపీ సెగ తమ్మినేనికి పెరిగింది. దీనిపై టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి.. ప్రత్యేకంగా దృష్టి పెట్టడం గమనార్హం.
మహాత్మాగాంధీ లా కాలేజీలో తాను అడ్మిషన్ తీసుకున్నట్టు తమ్మినేని గతంలో ప్రకటించారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్లను ఆయన సమర్పించలేదు. అయితే.. ఈ సర్టిఫికెట్‌ల కాపీలను సమాచార హక్కు చట్టం కింద నర్సిరెడ్డి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఓయూ సేకరించారు. సీతారాం నాగర్‌కర్నూలు స్టడీ సెంటర్(2015-18), డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా (హాల్‌టికెట్ నెంబరు 1791548430) బీకాం పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు.
అయితే, సీతారాం పేరు నాగర్‌కర్నూలు స్టడీ సెంటర్ రికార్డుల్లో లేదని తమ విచారణలో తేలిందని నర్సిరెడ్డి తెలిపారు. డిగ్రీ డిస్‌కంటిన్యూ చేసిన తమ్మినేని సీతారాంను మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారో ప్రశ్నిస్తే సమాధానం లేదని విమర్శించారు. ఓయూకు సమర్పించిన సర్టిఫికెట్ల కాపీలను నర్సిరెడ్డి విడుదల చేశారు. మొత్తంగా చూస్తే.. ఈ వివాదం తమ్మినేనికి చుట్టుకుంటోంది. అయితే.. రాజకీయంగా ఇది ఆయనపై ప్రభావం చూపించినా.. టెక్నికల్‌గా వచ్చే ఇబ్బంది అయితే లేదని అంటున్నారు పరిశీలకులు.