బీఆర్ఎస్‌కు ఉన్న విచ‌క్ష‌ణ‌.. వైసీపీకి లేదు: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫైర్‌

Pawan kalyan

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌రించే విష‌యంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్‌కు ఉన్న విచ‌క్ష‌ణ‌, ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఏమాత్రం లేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా.. కేంద్ర ప్ర‌భుత్వం ఈ ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌రించేది లేద‌ని చెప్ప‌డం ఊపిరిచ్చిన‌ట్టుగా ఉంద‌న్నారు. కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే ప్ర‌క‌ట‌న‌ను పవన్ కళ్యాణ్ స్వాగతించారు. కేంద్రమంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదని విమ‌ర్శించారు.

ఈ పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు సానుకూలంగానే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని తెలియచేసి ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరానని ప్రస్తావించారు. ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు’ అని చేసిన ప్రకటన హర్షణీయమన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై తొలి నుంచీ వైసీపీ నేత‌ల‌కు, పాల‌కుల‌కు చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని విజ్ఞప్తి చేసినా వైసీపీ పాలకులు స్పందించలేదని మండిపడ్డారు. జనసేన పార్టీ ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వంతో చర్చించినప్పుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పామని పవన్ అన్నారు.

“కొద్ది రోజుల కిందట పొరుగు రాష్ట్రం తెలంగాణ‌ ఈ అంశంలో స్పందించింది. దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారే తప్ప పరిశ్రమ కాపాడుతామనే మాట చెప్పలేకపోయారు” అని వైసీపీ నాయకులకుపై పవన్ విమర్శలు గుప్పించారు.