మొత్తానికి జగన్ సర్కారు అనుకున్నది సాధించింది. మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌తో ఆమోదింపజేసుకుంది. పేరుకు మూడు రాజధానులు అంటున్నప్నటికీ.. కార్య నిర్వాహక వ్యవస్థకు కేంద్రం కాబోతున్న విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్‌కు ఇకపై అసలైన రాజధాని అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
కేవలం శాసన సభ, శాసన మండలి సమావేశాలకు మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యులు, ఎమ్మెల్సీలు అమరావతికి రావాల్సిన అవసరముంది. మిగతా సమయాల్లో ఎవరికీ అమరావతిలో పని లేదు. సీఎం జగన్ ఎన్నికలకు ముందే అమరావతిలో పెద్ద ఇల్లు కట్టుకున్నారు కానీ.. అది ఇక అలంకార ప్రాయమే.
అసెంబ్లీ సమావేశాలకో లేదా కోర్టు పనుల మీద వచ్చినపుడో తప్ప ఈ ఇంటిని ఆయన ఉపయోగించకపోవచ్చు. ఇదిలా ఉంటే.. ఇంతకీ చంద్రబాబు రాబోయే రోజుల్లో ఎక్కడ ఉండబోతున్నారన్నది ఆసక్తికరం. ముఖ్యమంత్రిగా అయిదేళ్లు అమరావతిలో ఉన్నప్పటికీ ఆయన సొంతంగా ఇల్లు కట్టుకోలేదు.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆయనుంటున్న ఇల్లు ముంపునకు గురవడంతో వేరే అద్దె ఇంటికి మారారు. ఈ సంగతలా ఉంచితే ఇప్పడు రాజధాని విశాఖకు మారుతోంది. అమరావతిలో పెద్దగా కార్యకలాపాలేమీ ఉండవు. ప్రభుత్వం అంతా నడిచేది విశాఖలోనే. అనివార్యంగా చంద్రబాబు అక్కడికి వెళ్లాల్సిందే. కానీ అలా వెళ్తే చంద్రబాబు అమరావతిని పక్కన పెట్టేసినట్లు అవుతుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వెంటనే కదలాల్సిన అవసరం లేదు కానీ.. కొన్ని నెలల తర్వాత అయినా చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తికరం.