ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా.. ఆయనకు ఆప్తుడిగా ఉండే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. అది కూడా ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేసే వేళలో.. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికార పక్ష నేతలు మార్కాపురం వెళ్లారు.
మంత్రులు.. ఇతర ముఖ్యనేతలతో పాటు బాలినేని హెలిప్యాడ్ వద్దకు బయలుదేరారు. వాహనంలో వెళుతున్న బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు.వాహనం పక్కన పెట్టి హెలిప్యాడ్ వరకు నడిచి వెళ్లాలని సూచించారు. దీంతో.. ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆయనకు నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్.. జిల్లా ఎస్పీతో పాటు ఇతర నేతలు ప్రయత్నించారు.
తీవ్రఆగ్రహానికి గురైన బాలినేని శాంతించలేదు. తన అనుచరులతో కలిసి మార్కాపురం నుంచి బయలుదేరి వెనక్కి వెళ్లిపోయారు. ఈ ఉదంతం అధికారపార్టీలో ఇబ్బందికరంగా మారింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు అని తెలిసి కూడా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. నిబంధనలకు తగ్గట్లు తాము నడుచుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. మంత్రులకు మాత్రమే వాహనాల్లో వెళ్లే సౌకర్యం ఉండటంతో.. అదే నిబంధనను ఫాలో అయ్యారు. కాకుంటే.. బాలినేని స్థాయి తెలిసిన నేపథ్యంలో స్థానిక పోలీసులు కాస్తంత సంయమనంతో వ్యవహరించి ఉంటే బాగుండేదంటున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates