వైసీపీలో కలకలం..ఎంఎల్ఏకి వ్యతిరేకంగా పోస్టర్లు

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పోస్టర్ల కలలకం మొదలైంది. కలకలం ఎందుకంటే ఎంఎల్ఏ మేడా మల్లికార్జునరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు భారీఎత్తున వెలిశాయి. అందులో మా నమ్మకం జగనన్న మీదే కానీ ఎంఎల్ఏ మల్లికార్జునరెడ్డి మీద కాదని స్పష్టంగా ఉంది. పోస్టర్లను ఎవరో చక్కగా డీటీపీ చేయించి పెద్దక్షరాలతో వందలాది పోస్టర్లు వేయించారు. వాటిని మైన్ జంక్షన్లతో పాటు రైల్వేస్టేషన్ ప్రాంతంలో కూడా కరెంటు స్తంబాలకు తగిలించి, గోడలకు కూడా అంటించారు.

హఠాత్తుగా వెలసిన పోస్టర్లతో పార్టీలో కలకలం మొదలైంది. ఎందుకంటే ఆ పోస్టర్లలో ఎంఎల్ఏ వల్ల నష్టపోయిన నాయకులు, కార్యకర్తలని రాసుంది. మేడా వల్ల నష్టపోయిన నేతలు ఎవరు ? ఏ విధంగా నష్టపోయారనే విషయాలు ఇపుడు పార్టీలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఇక్కడ విషయం ఏమిటంటే ఎంఎల్ఏ మేడాకు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధరెడ్డితో ఏమాత్రం పడటంలేదు. జిల్లాలో రెండు గ్రూపులు బలమైనవే కావటంతో రెగ్యులర్ గా ఈ గ్రూపుల మధ్య గొడవలవుతున్నాయి.

కొంతకాలం ఎంఎల్ఏ అసలు పార్టీలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు. దాంతో తొందరలోనే మేడా టీడీపీలోకి జంపయిపోతారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయితే దాన్ని ఎంఎల్ఏ ఖండించటంతో ప్రచారం కొంతవరకు కంట్రోల్ అయ్యింది. అయితే పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పెద్ద యాక్టివ్ గా ఉండటంలేదు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో కొంతవరకు తిరిగిన ఎంఎల్ఏ తర్వాత అడ్రస్ లేరు.

మళ్ళీ ఇపుడు మొదలైన మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్తు నువ్వే జగనన్న కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మేడా తిరుగుతున్నట్లు ఎక్కడా వార్తలు కూడా లేవు. ఈ నేపధ్యంలోనే జగనన్న అంటే నమ్మకమే కానీ ఎంఎల్ఏ మేడా మల్లికార్జునరెడ్డంటే మాత్రం నమ్మకం లేదని పోస్టర్లు ప్రత్యక్షమవ్వటమే అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఎంఎల్ఏ మీద ఎవరికి నమ్మకంలేదో తెలీటంలేదు. మోసపోయిన నాయకులు, కార్యకర్తలన్నారే కానీ ఎవరో చెప్పలేదు. మరి మామూలు జనాలకు మేడా మీద నమ్మకం ఉందా లేకపోతే వాళ్ళకి కూడా లేదా ? అన్నదే అర్ధం కావటం లేదు.