తెలంగాణాకు అసలు అర్హతుందా ?

కొద్దిరోజులుగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేటీయార్ , తెలంగాణా ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కేసీయార్, కేటీయార్ ఇద్దరు చాలాసార్లు మాట్లాడారు. స్టీల్ ఫ్యాక్టరి అమ్మకానికి కేంద్రం ఇచ్చిన బిడ్డింగులో తెలంగాణా ప్రభుత్వం కూడా పాల్గొంటుందని గంభీరంగా ప్రకటించారు. సింగరేణి కాలరీస్ తరపున తెలంగాణా ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనబోతున్నట్లు కేటీయార్ ప్రకటించారు.

ప్రకటించటమే కాకుండా సింగరేణి కాలరీస్ కు చెందిన డైరెక్టర్లు, నిపుణుల బృందం వైజాగ్ వెళ్ళి అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడారు. టెక్నికల్ అంశాలతో పాటు ఇతరత్రా నిర్వహణ విషయాలు, ఆర్ధిక పరిస్ధితులను కూడా అడిగి తెలుసుకున్నారు. బిడ్లు దాఖలు చేయటానికి ఈనెల 15వ తేదీ ఆఖరుతేదీ. అయితే ఏపీ మంత్రి అమర్నాధ్ చెప్పిన అసలు విషయంతో తెలంగాణాకు షాక్ కొట్టినట్లయ్యింది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వం నియమావళి ప్రకారం బిడ్లు వేసేందుకు తెలంగాణాకు అసలు అర్హతే లేదట.

అమర్నాధ్ ఏమి చెప్పారంటే 2022లో కేంద్రం జారీచేసిన మెమో ప్రకారం ఏదైనా ప్రభుత్వరంగ సంస్ధను కేంద్రం ప్రైవేటీకరించాలని అనుకుంటే అది జరిగిపోతుంది. ప్రైవేటీకరణకు జారీచేసిన బిడ్ల దాఖలులో మెమో ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలు, ప్రభుత్వ రంగ సంస్ధల్లో వాటాలున్న సంస్ధలు ఏవి కూడా బిడ్లలో పాల్గొనేందుకు లేదన్నారు. మంత్రి చెప్పిందాని ప్రకారం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరి కొనుగోలుకు బిడ్లు దాఖలు చేసే అవకాశం సింగరేణి కాలరీస్ కు లేదు.

ఎందుకంటే సింగరేణి కాలరీస్ లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వాటా ఉన్నది. ఈ నిబంధనను చూపించి సింగరేణి కాలరీస్ బిడ్డింగ్ వేసినా దాన్ని అనర్హతగా ప్రకటించే అవకాశముంది. కాబట్టి తెలంగాణా ప్రభుత్వం కూడా బిడ్డింగులో పాల్గొంటుందని చెప్పుకునేందుకు, హడావుడి చేయటానికి మాత్రమే పనికొస్తుంది. అంటే తాజాగా మంత్రి చెప్పింది చూస్తుంటే బిడ్డింగులో ఏపీ ప్రభుత్వం కూడా పాల్గొనే అవకాశముందని కేంద్రం అనుమానించింది. ఒకవేళ ప్రభుత్వం బిడ్డింగులో పాల్గొంటే తాము అనుకున్న వాళ్ళకి సంస్ధను కట్టబెట్టే అవకాశముండదు. అందుకనే కేంద్రానికి అనుకూలంగా ఇంకా చెప్పాలంటే ప్రైవేటు సంస్ధలకు మాత్రమే అనుకూలంగా ఉండేట్లు నిబంధనలు విధించింది. కాబట్టి తెలంగాణా బిడ్డింగులో పాల్గొనే అవకాశంలేదు.