కేసీఆర్ ఐడియా జగన్ కి ఇబ్బందే

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టబోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఫ్యాక్టరీని కొనుగోలు చేయటంలో తెలంగాణా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని కేంద్రానికి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఇఓఐ) తెలియజేయబోతోందట. అలాగే వైజాగ్ వెళ్ళి ఫ్యాక్టరీ కొనుగోలుకు అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చి నివేదిక అందించమని కేసీఆర్ ఆదేశించారు.

ఇక్కడ విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేబదులు తమకే కేటాయించమని జగన్ కేంద్రానికి లేఖరాసినా మోడీ పట్టించుకోలేదు. పైగా టాటా, పోస్కో లాంటి ప్రైవేటు యాజమాన్యాలు ఫ్యాక్టరీని పరిశీలించి వెళ్ళాయి. దాంతో ప్రైవేటుపరం చేయటానికి మోడీ ప్రభుత్వం డిసైడ్ అయ్యిందనే విషయం తేలిపోయింది. ఇక్కడే కేసీయార్ సీన్ లోకి ఎంటరయ్యారు.

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని సింగరేణి కంపెనీ తరపున కొనుగోలు చేయాలని కేసీయార్ అనుకున్నారట. దీనివల్ల తెలంగాణాకు, ఫ్యాక్టరీకి కూడా ఉపయోగమే. ఎలాగంటే స్టీల్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సింగరేణి నుండి అందుతుంది. అలాగే తెలంగాణాలో ప్రాజెక్టులకు అవసరమైన ఉక్కు తక్కువ ధరకే దొరుకుతుంది. కాకపోతే ఐరన్ ఓర్ గనులను కేంద్రం కేటాయించాలంతే. ఇది జరిగితే ఉక్కు ధరలు మరింతగా తగ్గిపోతాయి. కొంతకాలానికి ఫ్యాక్టరీ లాభాల బాట పడుతుంది.

ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే జగన్ ను ఇరుకునపెట్టచ్చు. ఎలాగంటే ఏపీకి సంబంధించిన ఫ్యాక్టరీని తెలంగాణా ప్రభుత్వం కొనుగోలు చేసిందంటే జనాలు ఎలా రియాక్టవుతారు ? ముఖ్యంగా తెలంగాణా ప్రభుత్వంపై ఉత్తరాంధ్రలో సానుకూలత మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇది రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా బీఆర్ఎస్ కు బాగా ఉపయోగపడుతుంది. అంతాబాగానే ఉంది మరి కేసీయార్ చేద్దామని అనుకుంటున్న పనినే జగన్ కూడా చేస్తే ? ఏపీ ప్రభుత్వం ద్వారానే స్టీల్ ఫ్యాక్టరీ కొనుగోలుకు జగన్ కూడా ప్రయత్నించ్చు కదా. ఏదేమైనా ముందుముందు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్లు జరిగే అవకాశముంది.