సీపీఎస్ ర‌ద్దు చేసేలా నిర్ణ‌యం: లోకేష్ హామీ!

ఏపీ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న కంట్రిబ్యూట‌రీ పింఛ‌న్‌(సీపీఎస్‌) ర‌ద్దుపై టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారాలోకేష్ సంచ‌ల‌న హామీ ఇచ్చారు. సీఎం జ‌గ‌న్‌.. 2019ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో సీపీఎస్ ర‌ద్దుపై హామీ ఇచ్చార‌ని.. అయితే.. అధికారంలోకి వ‌చ్చాక‌.. తెలియ‌క ఇచ్చాను.. అప్ప‌ట్లో గుర్తించ‌లేక పోయాను.. అని నంగ‌నాచి క‌బుర్లు చెప్పార‌ని లోకేష్ విమ‌ర్శించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తున్నార‌ని అన్నారు.

అయితే.. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చాక‌.. ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వానికిఆమోద యోగ్యం అయ్యేలా సీపీఎస్ ర‌ద్దుపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. లోకేష్ నిర్వ‌హిస్తున్న‌ యువగళం పాదయాత్ర… అనంతపురం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. పాదయాత్రను జంబులదిన్నె విడిదికేంద్రం నుంచి.. యువనేత ప్రారంభించారు. భారీ సంఖ్యలో స్థానికులు, టీడీపీ కార్యకర్తలు యాత్రలో పాల్గొని పాద‌యాత్ర‌కు మద్దతుగా నడిచారు. వివిధ వర్గాల సమస్యల్ని తెలుసుకుంటూ లోకేష్ ముందుకు కదిలారు.

విడిదికేంద్రం వద్ద వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోంద ని… లోకేష్ మండిపడ్డారు. మళ్లీ టీడీపీ గెలిచిన తర్వాత అన్ని రంగాల్లో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీపీఎస్. రద్దుపై ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుందామని భరోసా ఇచ్చారు.

పాదయాత్రలో భాగంగా శింగనమల మండలం నర్సాపురంలో రైతులతో లోకేశ్ మాట్లాడారు. వాతావరణం అనుకూలించక భారీగా నష్టపోయామని వేరుశనగ రైతులు వాపోయారు. మూడేళ్లగా ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోయా యని… మద్దతు ధర కూడా లభించడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో బిందు సేద్యానికి.. యంత్రాలను 90శాతం రాయితీతో ఇచ్చామని జగన్‌ సర్కార్‌ రైతుకు మొండిచేయి చూపిందని ఈ సంద‌ర్భంగా నారా లోకేష్‌ మండిపడ్డారు.