2019లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. పార్టీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 22 మంది లోక్ సభ సభ్యులయ్యారు. నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దానితో లోక్ సభ సభ్యుల సంఖ్య 21 వద్ద నిలిచింది.
కాలచక్రం గిరగిరా తిరగడంతో మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అంతలోనే టికెట్ల పంచాయతీ మొదలైంది. సిట్టింగులు మళ్లీ టికెట్లు ఆశిస్తుంటే, ఆశావహులు వారికి పోటీ పడుతున్నారు. దానితో ఇప్పుడు అటు వారు ఇటు ఇటు వారు అటూ అన్న చర్చకు కూడా తెర లేచింది.
ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీలు
ఈ ఎంపీ పదవి మాకొద్దు బాబోయ్ అని కొందరు నేతలు డైరెక్టుగా చెప్పేస్తున్నారట. తాము ఎమ్మెల్యేలుగా మాత్రమే పోటీ చేస్తామని చెప్పేస్తున్నారట. అందులో కొందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి. కాకినాడ ఎంపీ వంగా గీత, అరకు ఎంపీ మాధవి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, అమలావుపం ఎంపీ చింతా అనురాధ చాలా కాలం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వైపు చూస్తున్నారు..
వంగా గీత పిఠాపురంలో పోటీకి సిద్ధమవుతున్నారు. అక్కడే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. మాధవి పాడేరు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. మార్గాని భరత్ రామ్, రాజమహేంద్రవరం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానంటున్నారు. చింతా అనురాధ, రాజోలుపై ఆశలు పెట్టుకున్నారు..
నాడు డీఎంకేలో..
1960లలో తమిళనాడు రాజకీయాలు మారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి డీఎంకే అధికారానికి వచ్చింది. 1970ల ప్రథమార్థంలో లోక్ సభ ఎన్నికలకు డీఎంకే అభ్యర్థుల ఎంపీ నానా కష్టంగా ఉండేదట. ఢిల్లీ వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడేవారు కాదట. మేము ఎమ్మెల్యేలుగా ఉంటాము.. వేరే వాళ్లను పార్లమెంటుకు పంపాలని సూచించేవారట. ఒక సారి ఎంపీగా ఎన్నికైన వారు సైతం పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లి హస్తినలో తట్టుకోలేకపోతున్నామని చెప్పేవారట. ప్రాంతం అలవాటు కాకపోవడం, భాష తెలియకపోవడం వారిని ఇబ్బంది పెట్టేవట. పైగా ఢిల్లీ రాజకీయాలకు ,తమిళనాడు రాజకీయాలకు తేడా ఉంటడంతో వారు టెన్షన్ పడిపోయేవారట. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పరిస్థితులు మారి ఢిల్లీ వెళ్లేందుకు తమిళ తంబీలు ఉత్సాహం చూపారట..
జనానికి దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలు
ఇప్పటికీ ఎంపీ అంటే జనానికి చేరువగా ఉండరన్న వాదన కొన్ని వర్గాల్లో ఉన్నదే. నియోజకవర్గ భౌగోళిక పరిధి ఎక్కువగా ఉండటంతో వారు ఎక్కువగా అందరితో కలిసిపోయే అవకాశాలు కనిపించడం లేదు. ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధి తక్కువగా ఉండటం, ఎమ్మెల్యే అంటే ప్రజల్లో ఉండే నాయకుడిగా మొదటి నుంచి పేరు ఉండటంతో ఆ పదవికి పోటీ పడేందుకే నేతలు ఇష్టపడతారు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి చేపట్టే ఛాన్స్ కూడా రావచ్చు. అందుకే ఇప్పుడు వైసీపీ ఎంపీలు కొందరు ఎమ్మెల్యే పదవికి పోటీ పడుతున్నారనుకోవచ్చు…