తిరుపతిలో స్టిక్కర్ వార్ మొదలైంది. స్టిక్కర్ వార్ ఏమిటని అనుకుంటున్నారా ? వైసీపీ మొదలుపెట్టింది కదా ఒక కార్యక్రమాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు’ అని. దానికి పోటీగా జనసేన నేతలు, కార్యకర్తలు పోటీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇదేమిటంటే ‘పవనే మా భవిష్యత్తు’ అని. ఒకేరోజు రెండుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పోటీ కార్యక్రమాలను నిర్వహించటం వల్ల తిరుపతిలోని కొన్ని డివిజన్లలో అక్కడకక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తింది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వైసీపీ కార్యక్రమాన్ని జనసేన అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం మొదలైపోయింది. ఎందుకంటే వైసీపీ నేతలు కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత అప్పటికప్పుడు జనసేన నేతలు కూడా పోటీగా రంగంలోకి దిగారుకాబట్టి. ఇలాంటి కార్యక్రమాలు ఎవరికీ మంచివి కావని జనసేన నేతలు గుర్తించటంలేదు. ఎవరిపార్టీ అధినేతలకు మద్దతుగా ఆయా పార్టీలోని నేతలు, కార్యకర్తలు ప్రచారంపేరుతో జనాల్లోకి వెళ్ళటం కొత్తేమీకాదు.
కానీ పోటీగా ఒకేరోజు కార్యక్రమాలు చేయటం వల్ల అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకున్నట్లు అవుతుందే కానీ ఎలాంటి లాభంలేదు. వైసీపీ కార్యక్రమం అయిపోయిన తర్వాత జనసేన పోటీ కార్యక్రమాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరంలేదు. రాష్ట్రమంతా 14 రోజుల పాటు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం జరగబోతోందని పార్టీ ముందు ప్రకటించింది. ఆ తర్వాతే జనసేన నేతలు రంగంలోకి దిగారు. అనారోగ్య పోటీని పోషించాల్సిన అవసరం ఎవరికీ లేదన్న విషయం జనసేన నేతలు గ్రహించకపోతే నష్టపోయేది వాళ్ళే.
ఇదివరకు కూడా పోటీ ర్యాలీలు, పోటీ సభలు పెట్టినపుడు పార్టీల మధ్య చాలా గొడవలయ్యాయి. ఇలాంటి గొడవలు అవ్వకూడదంటే పార్టీల మధ్య సంయమనం చాలా అవసరం. మరి పోటీ కార్యక్రమం మొదలైందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టిలో ఉందో లేదో తెలీదు. ఎందుకంటే కావాలనే పోటీ కార్యక్రమం మొదలుపెట్టి గొడవలకు కారణమైతే నష్టపోయేది జనసేన నేతలు, కార్యకర్తలే కానీ మరొకళ్ళు కాదు. కాబట్టి ఇలాంటి పోటీ కార్యక్రమాలు ఇతర ప్రాంతాల్లో కూడా మొదలుకాకుండా పార్టీ నాయకత్వం ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇది చివరకు గందరగోళానికి దారితీయటం ఖాయం.