ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమా న్ని అంగరంగ వైభవంగా ప్రారంభించాలని పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుకు కదిలారు. భుజాలకు ప్రత్యేకంగా రూపొందించిన సంచీని తగిలించుకుని ప్రతి ఇంటికీ తిరిగారు.
అయితే..వీరి రాకకుముందుగానే.. ప్రతి ఇంటికీ.. ‘జగనన్నే మా భవిత’ పేరుతో ముద్రించిన స్టిక్కర్లను అంటించారు. అనంతరం.. ఆ స్టిక్కర్లను చూపిస్తూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు.. ప్రజలకు ప్రభుత్వ పథకాల పై వివరించారు. నాలుగేళ్లలో సీఎం జగన్ ఏం చేశారు..వచ్చే ఏడాది కాలంలో ఏం చేయనున్నారనే విషయాలను కూడా వారు వివరించారు. అయితే.. వైసీపీలోని ఓ వర్గంలో చిన్నపాటి గుసగుస వినిపించింది.
స్టిక్కర్లయితే వేశారు.. బాగానే ఉంది. కానీ, ఓట్లు పడతాయా? అని వారు చర్చించుకోవడం గమనార్హం. ఎందుకంటే.. తాజాగా జరిగిన కార్యక్రమంలోనూ ప్రజలు పలు చోట్ల అభివృద్ది గురించి చర్చించారు. తమకు రోడ్లు లేవని.. తాగునీటి సౌకర్యం లేదని.. పెద్ద ఎత్తున ప్రశ్నించడం కనిపించింది. విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లోని శివారు ప్రజలు, కొండ ప్రాంతాల ప్రజలు తమకు తాగునీరు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు.
అదేవిధంగా నగరిలో మంత్రి రోజా, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు కూడా ఇంటింటికీ సంచీలు వేసుకుని.. తిరిగి.. గత చంద్రబాబు పాలనకు.. తమకు తేడాను వివరించారు. ఈ సమయంలో కొందరు అభివృద్ధి గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోజా కలుగ జేసుకుని.. ఈ కార్యక్రమం వేరు.. మేం చెప్పింది.. వినండి! అంటూ.. సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలతో స్టిక్కర్ అయితే వేశారు.. కానీ.. ఓట్లు పడతాయా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.