వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు మంత్రులు టీడీపీకి టచ్‌లో ఉన్నారని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నాయ కుడు, నటుడు బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొందరు తనతో కూడా టచ్‌లో ఉన్నారని చెప్పారు. వారంతా వచ్చి.. టీడీపీతో కలిసి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారని బాలయ్య చెప్పారు. టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు.
శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్ల దిన్నెమండలంలో మార్తాడులో యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు బాలయ్య సంఘీభావం తెలిపారు. తొలుత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పబ్జీ ఆడుకోవడం తప్ప ముఖ్యమంత్రి జగన్‌కు ఏమీ తెలియదని బాలకృష్ణ విమర్శించారు. దీంతో పాలన లేకుండా పోయిందని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫ్రీ హ్యాండ్ లేదని, వారి మాటకు అసలు విలువేలేదని బాలయ్య చెప్పారు. ఇప్పటికిప్పుడు టీడీపీ గేట్లు తెరిస్తే.. 60 నుంచి 80 మంది వరకు టీడీపీలోకి వచ్చేస్తారని చెప్పారు. ఎవరినైనా బెదిరించవచ్చని జగన్ భావిస్తున్నారని.. కానీ, తమ దగ్గర జగన్ ఆటలు సాగబోవని చెప్పారు. ఏపీలో అసమర్థ, చెత్త పాలన సాగుతోందని అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి లేదని, పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి కూడా పోతున్నాయని బాలయ్య చెప్పారు. అమరావతి రైతులు.. రాష్ట్ర రాజధానికోసం ఉద్యమిస్తుంటే.. వారిపైనా దాడులు చేస్తున్నారని, వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏపీ త్వరలోనే మరో శ్రీలంక అవుతుందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి మరోసారి సైకో జగన్ వస్తే.. రాష్ట్ర ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలస పోతారని అన్నారు.