మోదీ.. సెటైర్ కు రెడీ

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ఆయన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భాగ్యనగరానికి వస్తున్నారు. సాధారణంగా అయితే అది రొటీన్ పర్యటన అయినా.. తాజా పరిణామాలు మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. టెన్త్ పేపర్ లీక్ పేరుతో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం, రెండు రోజుల్లోనే ఆయనకు బెయిల్ రావడం లాంటి పరిణామాల మధ్య మోదీ కామెంట్స్, ప్రధాని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందోనని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పైగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పెద్ద గేమ్ ప్లానే జరుగుతోంది.పైగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కేసుల వార్ నడుస్తోంది. ఫార్మ్ హౌస్ కేసు చప్పబిడినట్లే కనిపించినా ఇప్పుడు పేపర్ లీకేజీ కేసులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అటు పక్క ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను సీబీఐ, ఈడీ బిగిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈడీ ఇప్పటికే ఆమె స్వయంగా సమర్పించిన పది సెల్ ఫోన్ల డేటాను విశ్లేషిస్తోంది.

సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ వస్తున్నారు. భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. స్పీచ్ అదరగొట్టడం,సెటైర్లతో కడుపుబ్బ నవ్వించడంలో మోదీ దిట్ట అని చెప్పాలి. పైగా ఇటీవలి కాలంలో ప్రధానమంత్రిని ఆహ్వానించే ప్రోటోకాల్ సైతం కేసీఆర్ పాటించడం లేదు. దానితో మోదీ ఎలాంటి డైలాగులు కొడతారోనని తెలుగు రాష్ట్రాల జనం ఎదురు చూస్తున్నారు. పైగా మోదీ రాకతో ఎన్నికల సమర శంఖారావం పూరించాలని బీజేపీ డిసైడైంది. అంటే ఇక దబిడి దిబిడేనన్నమాట..