డీజీపీపై నోరు చేసుకున్న ర‌ఘునంద‌న్‌!

తెలంగాణ బీజేపీ నాయ‌కులు వ్య‌క్తిగ‌త వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు. ఇప్ప‌టికే బండి సంజ‌య్ ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంలో అరెస్ట‌య్యారు. ఇక, ఇప్పుడు మ‌రో కీల‌క నాయ‌కుడు, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే.. సుప్రీంకోర్టు లాయ‌ర్ కూడా అయిన‌.. ర‌ఘునంద‌న్‌రావు.. మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా.. తెలంగాణ డీజీపీ అంజ‌నీకుమార్ యాద‌వ్‌పై ఆయ‌న ప‌రుష వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ డీజీపి అంజనీకుమార్ యాదవ్ ను ‘బీహార్ గూండా’ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐపీఎస్ అధికారుల సంఘం.. ర‌ఘునంద‌న‌రావు అసెంబ్లీ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని.. స్పీక‌ర్‌ను కోరారు. అంతేకాదు.. ర‌ఘునంద‌న రావుపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని కోర‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఇప్ప‌టికే ర‌ఘునంద‌రావును కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఏం జ‌రిగింది?

బీజేపీ తెలంగాణ‌ అధ్యక్షుడు బండి సంజయ్ను ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ లీకు వ్య‌వ‌హారంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయ‌న‌ను భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ తరుణంలో ఆయన్ను పరామర్శించేందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు అక్క‌డ‌కు చేరుకున్నారు. అయితే.. ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది.

ఈ క్రమంలో పోలీసులు రఘునందన్ను వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేయగా.. వారితో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగి.. డీజీపీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ను ఎందుకు అరెస్ట్ చేశారని.. ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పడం లేదని రఘునందన్ రావు మండిపడ్డారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయడం లేదని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే అని చూడకుండా రెండు కిలోమీటర్ల దూరంలో తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అక్కడి నుంచి కాలి నడకన స్టేషన్ వద్దకు చేరుకున్నాని చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే డీజీపీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.