ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే, మంత్రి మధ్య అవినీతి పోరు తారా స్థాయికి చేరింది. తన మైలవరం నియోజకవర్గంలో గ్రావెల్, వీటీపీఎస్ బూడిద అక్రమ మైనింగ్ జరుగుతోందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి ఆరోపించారు. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఆ పని చేసే వారిలో తమ పార్టీ వారు కూడా ఉన్నారని వసంత ప్రకటించారు. డబ్బు దగ్గర అందరూ ఒకటయ్యారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ కు స్వయంగా తాను ఫిర్యాదు చేశానన్నారు. కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను కూడా ఆశ్రయించారన్నారు. తన నియోజకవర్గంలో అక్రమ వ్యవహారాలు సాగనివ్వనబోనని కూడా వసంత తేల్చేశారు..
మంత్రి జోగి రమేష్ వర్సెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అధిపత్యపోరు, అవినీతి పోరు చాలా కాలంగా సాగుతోంది. ఈ క్రమంలో వసంత కొంచెం ముందుకు వెళ్లి ఎదురుదాడిని వేగం పెంచేశారు. నియోజవర్గంలో వస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరించారు. ఆ మాట మంత్రి జోగి రమేష్ ను ఉద్దేశించి అన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు.
నిజానికి వసంత , జోగి మధ్య పోరు చాలా కాలంగా సాగుతోంది. కనక వర్షం కురిపించే అక్రమ వ్యాపారం కోసం ఇద్దరు నేతలు కొట్టుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో గ్రావెల్, వీటీపీఎస్ బూడిద ఈ రెండూ కనకవర్షం కురిపించే వనరులు. ఈ రెండింటినీ మైలవరం ఎమ్మెల్యే బామ్మర్థి, ఎమ్మెల్యే అనుచరులు ఈ నాలుగేళ్ల కాలంలో పూర్తిస్థాయిలో దోచుకున్నారు. దానితో తనకూ అందులో వాటా కావాలని జోగి రమేష్ అనుకున్నారు. మైలవరం నియోజకవర్గంలో జెండా పాతాలని జోగి తన తమ్ముడిని రంగంలోకి దింపారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ తన తమ్ముడిని కూర్చోబెట్టగలిగితే అటు గ్రావెల్ విషయంలోను ఇటు వీటీపీఎస్ బూడిద విషయం లోనూ చక్రం తిప్పవచ్చని జోగి భావించారు. కానీ వసంత ఆయన ఆటలను సాగనివ్వలేదు. జోగి తమ్ముడికి చైర్మన్ పీఠం దక్కకుండా చేయడం లో ఆయన పైచేయి సాధించారు. ఇది జోగి రమేశ్‌ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
అవకాశం కోసం ఎదురుచూసిన జోగి రమేష్ కు మంత్రి పదవి రూపంలో అదృష్టం కలిసొచ్చింది. నెమ్మదిగా మైలవరంపై పట్టు బిగించడం ప్రారంభించారు. అందులో భాగంగా ఎమ్మెల్యే బామ్మర్ధి బూడిద వ్యాపారం పై దృష్టి పెట్టారు. ఇబ్రహీంపట్నం థర్మల్ స్టేషన్ నుంచి వసంత బామ్మర్ది, అనుచరులు పెద్ద ఎత్తున తరలించుకు పోతున్న బూడిదను అడ్డుకోవడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ మండల కన్వీనర్ నల్లమోతు శివనాగేశ్వరరావు బూడిద లారీలను అడ్డుకుని వసంత కృష్ణప్రసాద్ ను బూతులు తిట్టడం సంచనలమైంది. దానితో ఒక పక్క అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూనే మరో పక్క వసంత తన వ్యాపారాన్ని కొనసాగించారు. జోగిపై ఆరోపణలు కూడా కొనసాగించారు. అందులో భాగమే ఇటీవల గ్రావెల్ అక్రమ తవ్వకాల పై విజిలెన్స్ అధికారులు దాడులు చేయడం, పోలవరం కాల్వ మట్టిని తరలించుకుపోవడం పై జాతీయ హరిత ట్రిబ్యునల్ రంగంలోకి దిగడమని అనుకోవాలి. వసంత స్వయంగా గ్రావెల్ అక్రమ తవ్వకాల పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విషయం నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ వరకు వెళ్లింది.
వసంత బూడిద వ్యాపారంలో నెలకు రెండు కోట్ల రూపాయలు దండుకుంటన్నారని జోగి రమేష్ బ్యాచ్ ఆరోపిస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ.86 కోట్లు విలువైన బూడిదను జాతీయరహదారి నిర్మాణం చేస్తున్న సంస్థకు వసంత బామ్మర్ది సరఫరా చేశారని జోగి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే అదంతా ఒట్టిమాటేనని మొత్తం జోగి రమేష్ దోచుకుంటున్నారని వసంత ప్రత్యారోపణ చేస్తున్నారు. ఏది నిజమో తెలియాల్సి ఉంది…