మూలిగే నక్క పై తాటిపండు పడటం అనే సామెత తెలంగాణా ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్వహించిన పరీక్షల పేపర్ల లీకేజీ వ్యవహారం గట్టిగా కేసీయార్ మెడకు చుట్టుకునేసింది. ఇందులో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక కేసీయార్ నానా అవస్తలు పడుతున్నారు. ఇటువంటి సమయంలోనే పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా లీకవుతుండటంతో ఏమిచేయాలో దిక్కుతోస్తున్నట్లు లేదు. ఇప్పటికి రెండు పరీక్షలు జరిగితే రెండు ప్రశ్నపేపర్లూ లీకయ్యాయి.
విచిత్రం ఏమిటంటే పరీక్ష మొదలైన పదినిముషాల్లోపే రెండు ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చేయటమే. ప్రశ్నపత్రాలు లీకేజీలను మొదట ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రశ్నపత్రాలు లీకేజీ కాలేదని మొదట్లో అడ్డంతిరిగింది. అయితే చివరకు ఆధారాలన్నీ చూసిన తర్వాత లీకైన విషయాన్ని అంగీకరించక తప్పలేదు. దాంతో రెండు క్వశ్చన్ పేపర్ల లీకేజీ విషయమై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధ్యులుగా కొందరిని అరెస్టులు చేసి సస్పెండ్ కూడా చేసింది.
ఇక్కడ సమస్య ఏమిటంటే బాధ్యులను గుర్తించటం, అరెస్టులు చేయటం, విచారణ మొదలుపెట్టడం కాదు. అసలు ప్రశ్నపత్రం లీకేజీ కాకుండా ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేక పోతోందన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. ప్రశ్నపత్రాలను టీచర్లు లేదా ఇతర ఉద్యోగులే లీక్ చేస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు టీఎస్ పీఎస్సీ పరీక్షల ప్రశ్న పేపర్ల లీకేజీపై విచారణ జరుగుతోందన్న విషయం అందరికీ తెలుసు. పట్టుబడితే ఏమవుతుందన్న విషయమూ అందరికీ తెలుసు.
అయినా ఏమాత్రం బయటపడకుండా కొందరు ప్రశ్నపత్రాల లీకేజీకి తెగిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే పట్టుబడుతామని, విచారణ జరుగుతుందని, అరెస్టు చేస్తారని, కోర్టు ద్వారా శిక్షలు పడతాయనే భయం కూడా కనబడటంలేదు. ఇదే సమయంలో ఏపీ లో జరుగుతున్న పరీక్షల ప్రశ్నపత్రాలు లీకేజీ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. క్వశ్చన్ పేపర్లోని ప్రతి ప్రశ్నకు ప్రత్యేకమైన బార్ కోడ్ కేటాయించినట్లు సమాచారం. ఎవరైనా ప్రశ్నపత్రం లీకేజీకి ప్రయత్నించినా బార్ కోడ్ కారణంగా ఎవరి మొబైల్ నుండి పేపర్ లీకైందన్న విషయం వెంటనే అధికారులకు తెలిసిపోతుంది.
అలాగే పరీక్షలు జరిగే స్కూళ్ళల్లో సిబ్బంది మొబైల్ ఫోన్ల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. స్కూళ్ళ ను నో మొబైల్ జోన్లుగా ప్రకటించింది. పరీక్ష పేపర్లను లీక్ చేస్తే ఏడేళ్ళు జైలుశిక్ష తప్పదని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని జాగ్రత్తల వల్ల ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీకైందని ఎవరు చెప్పలేదు. ఇలాంటి జాగ్రత్తలే తెలంగాణా ప్రభుత్వం కూడా తీసుకుంటే బాగుంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates