ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఇటీవల కాలంలో వరుసగా.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
తాజాగా శ్రీకాకుళంలోని రాగోలులో ‘జగనన్న ఆసరా’ పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై విరుచుకుపడ్డారు. ‘మొన్న ఓ చోట జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ ఓ మహిళ.. ఆసరా డబ్బులు జగన్ ఇంట్లోంచి ఇచ్చేస్తున్నాడా అంటోంది. తిన్నది తిరగబోసుకోవడం అంటే ఇదే. సంస్కారం లేకపోతే ఎలా? ఏం మనుషులో ఏంటో.. పద్దుకు మాలిన వ్యక్తుల్లా మాట్లాడితే ఎలా’ అని వ్యాఖ్యానించారు.
ధరలకు జగన్‌కు ఏం సంబంధం?
‘ఒకరు రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ప్రచారం చేస్తారు. ధరలు పెరగడానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధమేంటి? ధరలు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయి. జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రేమను తగ్గించేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారమిస్తే మోసం చేసిన విషయం మీకు తెలిసిందే. ఇచ్చిన హామీని అమలు చేసిన ఘనత జగన్ మోహన్‌రెడ్డికే దక్కుతుంది’ అని మంత్రి పేర్కొన్నారు.
ఐదు నిమిషాలు వెయిట్ చేయండి.. ప్లీజ్
ఇటీవల కాలంలో పలు కార్యక్రమాలకు మహిళలు వస్తున్నా.. మంత్రులు, నేతలు చేసే ప్రసంగాలను వారు వినిపించుకోవడం లేదు. ఈక్రమంలో మహిళలు పాల్గొన్న సమావేశాల్లో గేట్లకు తాళాలు వేస్తున్నారు.
రాగోలులో మంత్రి ప్రసంగిస్తుండగా కొందరు మహిళలు బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.దీంతో మంత్రి ధర్మానకు తీవ్ర ఆగ్రహం వచ్చింది.
వెంటనే మంత్రి స్పందిస్తూ ‘ఐదు నిమిషాల్లో సమావేశం ముగియనుంది. ఏయ్ తల్లీ వెళ్లిపోదురు ఆగండి. ఒరేయ్.. ఆటోలు తీయకండి. స్టార్ట్ చేయకండి.. ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది’ అని ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన మహిళలు మధ్యలో వెనుదిరగకుండా నిలువరించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. గేటుకు తాళం వేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates