జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వరసుగా ఆయన బీజేపీ పెద్దలను అక్కడ కలుస్తున్నా రు. రెండో రోజు మంగళవారం స్వయంగా మీడియాతో మాట్లాడిన పవన్.. ఢిల్లీకి ఎందుకు వచ్చిందీ వివరించారు. ఏపీలో వైసీపీ పాలనకు విముక్తి కలిగించడమే అజెండాగా తాను డిల్లీలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ భ్రష్టు పట్టిపోయింద న్నారు. ఏపీలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని దుయ్యబట్టారు. రాజధాని లేదు. పోలవరం ప్రాజెక్టు లేదు.. అభివృద్ధి లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. ఉపాధి అసలే లేదు.. అని పవన్ విమర్శించారు.
అందుకే గతంలో తాను చెప్పినట్టు వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి.. వారితో చర్చించినట్టు పవన్ చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యాయని, ఏపీ విషయాలను చర్చించానని తెలిపారు. గతంలో తాను వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చనివ్వకుండా.. చూస్తానని చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలకు కూడా వివరించినట్టు తెలిపారు. ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీని గెలవకుండా చూడడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు.
సమావేశాలు అన్నీ సుహృద్భావ వాతావరణంలో సాగాయని పవన్ వెల్లడించారు. ఏపీపై బీజేపీ పెద్దలకు ఒక అవగాహన ఉందన్నారు. తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం తాము చర్చించలేదని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ-జనసేన ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైనే చర్చించామని.. ఈ క్రమంలో సంస్థాగతంగా ఇరు పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపైనే దృష్టి పెట్టామన్నారు. కేంద్రం నుంచి తనకు సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న విషయాన్ని తాను బీజేపీ నేతలు చెప్పానని పవన్ వెల్లడించారు. దీనికి వారు కూడా సమ్మతించినట్టు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates