ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కల నెరవేరే దిశగా మొదటి అడుగు పడింది. గవర్నర్ ఆమోదం కోసం వేచిచూస్తున్న సీఆర్డీఏ, రాజధానుల వికేంద్రీకరణ బిల్లలుకు రాజ్ భవన్ ఆమోదముద్ర వేసింది. పది రోజులుగా గవర్నర్ వద్ద ఉన్న ఈ బిల్లలను న్యాయ సలహా కోసం కొంచెం సమయం తీసుకున్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఎట్టకేలకు ఈరోజు వాటికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తగిలిన ఎదురుదెబ్బతో కాస్త ఇబ్బంది పడిన వైసీపీ శ్రేణులకు తాజా పరిణామం పెద్ద ఉపశమనం ఇచ్చిందని చెప్పాలి.
సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల క్రితం గవర్నర్ వద్దకు పంపారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో కేసులు నడుస్తుండటం, శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు పెండింగ్ ఉన్న నేపథ్యంలో గవర్నర్ బిల్లు ఆమోదించరేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా … పది రోజుల గ్యాప్ తీసుకుని న్యాయసలహాలు తీసుకున్న అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ బిల్లులకు ఆమోదం తెలిపారు.
దీంతో జగన్ 3 రాజధానుల కల నెరవేరడానికి మొదటి అడుగు పడినట్టయ్యింది. ఇపుడు అమరావతి విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. రైతులకు ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుంది.
రైతులు భూములు వెనక్కు తీసుకోవడానికి ఒప్పుకుంటారా? ఇది ఏ టర్న్ తీసుకుంటుందన్న ప్రశ్నలు అందరి మదిలో కదులుతున్నాయి. ఏది ఏమైనా ఇది ఏపీ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం. తదనంతరం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నబోతున్నాయనేది ఆసక్తికరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates