ధర్మాన ప్రసాదరావు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సీనియర్ రాజకీయ నేత. ఏ అంశంమీద అయినా అనర్ఘళంగా మాట్లాడగలిగిన కెపాసిటి ఉంది. మాటలు కూడా జాగ్రత్తగా బ్యాలెన్సుడుగానే ఉంటాయి. అయితే ఈ మధ్య మాట్లాడుతున్న తీరే కాస్త వివాదాస్పదంగా ఉంటోంది. తాను ఏమి మాట్లాడుతున్నారో తనకు అర్ధమవుతోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వైఎస్సార్ ఆసరా పథకం లబ్దిదారులతో మాట్లాడారు.
ఈ సమయంలో ధర్మాన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీసుకుంటూ కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని తిట్టడం సంస్కార హీనతగా వర్ణించారు. జగన్ ఇంట్లో డబ్బులు తెచ్చి పథకాలకు ఖర్చులు పెడుతున్నారా అంటు కొందరు వాదించటంలో అర్ధం లేదన్నారు. నేరుగా నగదు బదిలీ లాంటి పథకాలతోనే అవినీతిని తమ ప్రభుత్వం కంట్రోల్ చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలన్నీ కంటిన్యూ అవ్వాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ గెలవాలా వద్దా అన్నది లబ్దిదారులే తేల్చుకోవాలని మంత్రి బంపరాఫర్ ఇచ్చారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పథకాల లబ్దిదారులు ప్రభుత్వాన్ని విమర్శించకూడదని ఎక్కడా లేదు. అలాగే జనాలందరు అనుకుంటున్నట్లు జగన్ తన జేబులో నుండి డబ్బులు ఖర్చులు చేయటంలేదు. ప్రజల డబ్బును ప్రజలకే ఖర్చుపెడుతున్నారంతే. జగన్, చంద్రబాబునాయుడు అంతుకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమైనా చేసింది ఇదే అన్న విషయం ధర్మాన మరచిపోయారు. కాకపోతే పెడుతున్న ఖర్చంతా అర్హులకు సక్రమంగా అందుతున్నదా లేదా అన్నదే పాయింట్.
ప్రభుత్వం ద్వారా పథకాలు అందుకుంటున్న జనాలంతా తిరిగి అధికారపార్టీకే ఓట్లేయాలని ఏమీలేదు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమపథకాలను అమలుచేయక తప్పదని అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే సంక్షేమపథకాలను వర్తింపచేయమని జనాలెవరూ అడగలేదు. నేతలే తమ అవసరాల కోసం, అధికారంలోకి రావటంకోసం జనాలకు ఫ్రీ పథకాలను అలవాటు చేశారు. అలా అలవాటుచేసిన పథకాలే ఇపుడు రాష్ట్ర ఖజనాపై పెద్ద కొండలాగ భారంగా తయారైపోయింది. ఈ భారం నుండి బయటపడే మార్గాలు పార్టీల దగ్గరా లేవు, జనాలూ అందుకు అంగీకరించరు. కాబట్టి ధర్మాన చేసిన కామెంట్లు పార్టీకి ఎంతవరకు లాభదాయకమో ఆలోచించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates