చెప్పింది వినడం కాదు..మీరూ చెప్పండి.. రేపేం జరుగుతుంది.

Y S Jagan

వైసీపీకి ఏప్రిల్ 3 కీలమంటున్నారు. వైసీపీకే కాదు రాష్ట్రానికి కూడా కీలకం కావచ్చని చెబుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం  విస్తరణ, పునర్  వ్యవస్థీకరణకు అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముగ్గురు నలుగురిని  పంపేసి, వారి స్థానంలో మరికొందరిని  తీసుకునే వీలుందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 13 తర్వాత ఇప్పుడే మళ్లీ భేటీ జరుగుతోంది. గడప గడపకు కార్యక్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రత్యేకంగా ప్రస్తావన ఉండొచ్చు. గడప గడపకు కార్యక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదని జగన్ నిలదీయబోతున్నారు. గట్టిగా క్లాసీ తీసుకోబోతున్నారు. కాకపోతే జనం నిరసనలను కూడా ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి తీసుకురాబోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలను జనం గట్టిగా నిలదీయడంతో వాళ్లు  నీళ్లు నములుతున్న దృశ్యాలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ  చక్కర్లు కొడుతూ  వైసీపీని ఇబ్బంది  పెడుతున్నాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి  రెండు రోజుల్లో మూడు సార్లు నిరసనలు ఎదురయ్యాయి. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ  ఘోర పరాభవం చర్చకు వస్తుందని అంటున్నారు. మూడు పట్టభద్రుల నియోజకవర్గాలతో  పాటు  ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా అధికార పార్టీ  ఓడిపోయింది.అసలు తన పట్ల ఎమ్మెల్యేల్లో ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని జగన్ అనుకుంటున్నారట. అందుకోసం మీటింగులో ప్రసంగించాలనుకునే వారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. తాను మాట్లాడటానికి ముందు, ఆ తర్వాత కొందరికి  మాట్లాడే అవకాశం  ఉండాలని జగన్ కోరుకుంటున్నారట. ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కూడా జగన్ సిద్ధమవుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి మీడియా సాక్షిగా విమర్శలు సంధిస్తున్న తరుణంలో ఏదైనా సమస్య ఉంటే పార్టీలోనే అంతర్గతంగా  చర్చించుకుని, పరిష్కరించుకోవాలని జగన్ భావిస్తున్నారట. 

వైసీపీ ఎమ్మెల్యేలంతా ఇక నగరాల్లో తిరగకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఏకాగ్రత చూపాలని జగన్ ఆదేశించబోతున్నట్లు సమాచారం. అందుకు ఒక కారణం కూడా ఉంది. అర్బన్ ఏరియాల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెరిగింది. దాన్ని సరిచేసుకోవడం అంత సులభం కాదు. ఇప్పటికీ సంక్షేమ పథకాల కారణంగా గ్రామీణ  ప్రాంతాల్లో  జగన్ పట్ల అభిమానం  తగ్గలేదు. అందుకే  గ్రామీణ ప్రజల మద్దతును పదిలం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని జగన్  నమ్ముతున్నారు. ఇందులో భాగంగా జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడిన కార్యక్రమన్ని ఈ సారి ఫుల్ ఫోర్స్ తో నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ రెండు వారంలో స్టిక్కర్ల పంపిణీ కూడా ఉంటుంది. కాకపోతే జనం ఎలా స్పందిస్తారో చూడాలి..