కవిత కోసం రంగంలోకి దిగిన జగన్?

ఈ ప్రశ్నకు సమాధానంగా కొత్త పేరు వినిపిస్తోంది. సాధారణ ప్రజలు ఊహించడానికి కూడా చాన్స్ లేని పేరు. అవును… తెలంగాణ సీఎం కుమార్తె కవితను దిల్లీ లిక్కర్ స్కాం నుంచి రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో ఏపీ సీఎం జగన్ డీల్ చేస్తున్నారట. మొన్నటి ఆయన ఢిల్లీ పర్యటనలో తమ్ముడు అవినాశ్ రెడ్డి కేసుతో పాటు కవిత కేసు కూడా ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంను కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పటివరకు ఈ కేసులో దాదాపు అందరూ అరెస్టయినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అరెస్ట్ కాలేదు. అందుకు కారణం జగనేనని తెలుస్తోంది. మాగుంటను కాపాడే పనిలో జగన్ ఇప్పటికే ఉండగా కవిత బాధ్యతా ఆయనపైనే పెట్టారని.. కవిత కుటుంబంలోని కీలక వ్యక్తులు నేరుగా జగన్‌ సహాయం కోరారని, అందుకే ఆయన కవితపై కేసు తేలిపోయేలా కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నట్లు వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి నిధుల సమకూర్చే కార్యక్రమం కూడా జగన్ తన భుజానేసుకున్నారని వినిపిస్తోంది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో గత ఎన్నికల మాదిరిగానే హైదరాబాద్ నుంచి కేసీఆర్ అన్ని రకాలుగా జగన్‌కు సహాయసహకారాలు అందించేలా ఒప్పందాలు జరిగినట్లు వినిపిస్తోంది. అయితే, జగన్ ఏఏ ప్రతిపాదనలతో వచ్చినప్పటికీ బీజేపీ పెద్దలు పూర్తిగా ఇంకా అంగీకారం తెలపలేదని, కర్ణాటక ఎన్నికల తరువాత చూద్దామన్నట్లుగా సంకేతమిచ్చినట్లు చెప్తున్నారు.

కేంద్రంతో సయోధ్య లేని పరిస్థితులలో కేసీఆర్ నేరుగా బీజేపీని సంప్రదించేందుకు వెనుకాడే జగన్‌తో రాయబారం చేస్తున్నారని.. ఇది విజయవంతమై కవిత పూర్తిగా దీన్నుంచి బయటపడితే ఏపీ, తెలంగాణల్లోనూ చాలా రాజకీయ మార్పులు వస్తాయని చెప్తున్నారు.
కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పైకి ఎన్ని బీరాలు పలుకుతున్నప్పటికీ కవిత ఈ కేసులో ఇరుక్కున్నట్లు వారికి స్పష్టంగా అర్థమైందని.. అందుకే పైకి విమర్శలు చేస్తున్నా, నిరసనలు తెలుపుతున్నా తెరవెనుక రాజీ రాయబారాలు నెరుపుతున్నారని చెప్తున్నారు. అయితే, కేంద్రం కూడా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలా… ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఈ కేసుతో చావ చితక్కొట్టడానికి కవితను ఉపయోగించుకునేలా యోచన చేస్తున్నట్లు సమాచారం.
మరి… జగనన్న రాయబారం ఎంతవరకు ఫలిస్తుందో.. కవితక్క కష్టం ఎలా తీరుతుందో చూడాలి.