సుప్రీంకోర్టు దెబ్బ బాగా తగిలినట్లే ఉంది

సుప్రీంకోర్టు దెబ్బ సీబీఐకి బాగా గట్టిగానే తగిలినట్లుంది. అందుకనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో తొందరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ స్పెషల్ పీపీ చెప్పారు. వివేకా మర్డర్ కేసు దర్యాప్తును ఏప్రిల్ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి గడువు పెట్టిన విషయం తెలిసిందే. 2018లో వివేకా మర్డర్ జరిగితే ఇంతవరకు సీబీఐ దర్యాప్తులో పెద్దగా పురోగతి కనబడలేదని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.

దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను వెంటనే మార్చాలని ఆదేశించినా సీబీఐ అంగీకరించలేదు. దాంతో మండిపోయిన సుప్రింకోర్టు తానే సీబీఐ డీఐజీ చౌరాసియా ఆధ్వర్యంలో ఐదుగురు అధికారులతో కమిటిని నియమించేసింది. అప్పుడే దర్యాప్తుకు గడువు కూడా విధించింది. వివేకా మర్డర్ జరిగిన దాదాపు ఏడదిన్నర నుండి కేసును సీబీఐ అధికారులే దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని చాలాసార్లే సుప్రింకోర్టు ఆక్షేపించింది.

అయినా కూడా సీబీఐ పెద్దగా పట్టించుకోలేదు. కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ రామ్ సింగ్ ఎంతసేపు తమను దోషులుగా ఫిక్స్ చేయటానికే ప్రయత్నిస్తున్నట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మొత్తుకుంటున్నారు. వివేకా కూతురు సునీతారెడ్డి, టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటున్న రామ్ సింగ్ కడప ఎంపీ చేసిన ఆరోపణలను, అనుమానాలను మాత్రం పరిగణలోకి తీసుకోవటంలేదట. అందుకనే రామ్ సింగ్ వ్యవహారశైలిపైనే పిటీషన్ దాఖలైంది. దాంతో దర్యాప్తు నుండి రామ్ సింగ్ ఎగిరిపోయారు.

ఇపుడు తొందరలోనే వివేకా మర్డర్ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీబీఐ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. కేసు దర్యాప్తు మొదలుపెట్టిన ఇంత కాలానికి ఛార్జిషీటు దాఖలు చేయబోతున్నట్లు సీబీఐ చెప్పిందంటేనే సుప్రింకోర్టు దెబ్బ ఎంతగట్టిగా తగులుంటుందో ఊహించుకోవచ్చు. మరి సుప్రింకోర్టు ఇచ్చిన గడువులోగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఎంత స్పీడుగా దర్యాప్తు చేస్తుందో చూడాల్సిందే. ఇపుడన్నా రెండువైపులా వినిపిస్తున్న ఆరోపణలు, అనుమానాలపైన దర్యాప్తు జరుగుతుందా ? ముందసలు ఛార్జిషీటులో సీబీఐ ఏమి చెబుతుందో చూడాల్సిందే.