ఔను.. ఇప్పుడు ఏపీలోని ప్రతి జిల్లా గురించి.. చర్చ సాగుతోంది. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకంగా భ్రష్టు పడుతోందనే ఆవేదన, బాధ కనిపిస్తోంది. తాజాగా పులివెందులలో గన్ కల్చర్‌పై ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు యూపీలో వెలుగు చూసిన గన్ కల్చర్‌పై అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపారు. డిపాజిట్లను రెండింతలు పెంచడంతోపాటు.. ఎవరికి అవసర మో.. వారికి మాత్రమే గన్ ఇచ్చేలా చట్టంలోనూ మార్పులు తెచ్చారు.
కానీ, ఏపీలో ఎన్నడూ లేని విధంగా గన్ లైసెన్సు ఉన్న వ్యక్తి.. ఉన్నపళాన, చిన్న వివాదం.. చర్చలతో సర్దుబాటు అయ్యే అవకాశంఉండి కూడా.. తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఏకంగా కాల్పులకు దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇక, కర్నూలులోనూ ఫ్యాక్షన్ రగడ కొనసాగుతోంది. గతంలో చంద్రబాబు హయాంలో ఫ్యాక్షన్‌ను అరికట్టేందుకు.. అనేక చర్యలు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం మళ్లీ మొదటికి వచ్చింది.
విజయవాడలో ఒకప్పుడు రౌడీ యిజం ఉండేదని అంటారు. కానీ, ఇప్పుడు మరోసారి ఇక్కడ జడలు విచ్చుకుంటోంది. తూర్పు గోదావరిలో ఎస్సీలు బతకలేని పరిస్థితి వచ్చిందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీలపై దాడుల కేసుల్లో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. విశాఖను తీసుకుంటే.. భూ కబ్జాలకు కేంద్రంగా మారిందనే వాదన వినిపిస్తోంది. పులివెందుల, కడపల నుంచి వచ్చిన వారు ఇక్కడ దందాలు చేస్తున్నారని రోజుకో వార్త వస్తోంది.
ఇక, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. స్కూల్ విద్యార్థుల స్థాయిలోనే వీటికి బానిసలుగా మారుతున్నారని పోలీసులు ఆందోళన చెందే పరిస్థితివచ్చింది. ఇక, గంజాయి సాగు పెరిగిపోతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలా..రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ ఎన్నడూ లేని విధంగా ఈ విధమైన అసాంఘిక కార్యక్రమాలు చెలరేగుతుండడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.