అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 1200వ రోజుకు చేరుకుంది. భూములిచ్చిన రైతులు రాజధానిని కాపాడుకునేందుకు నాలుగు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, అధికారులు ఎన్ని రకాలుగా వేధించినా వెనక్కి తగ్గలేదు. న్యాయస్థానం అండతో రాజధానిని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. పోలీసుల లాఠీ చార్జ్ చేసినా ఏమాత్రం భయపడకుండా ఆడవాళ్లు సైతం ఈ పోరులో ముందు నిలిచారు.
ప్రభుత్వం దిగొచ్చి అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందనే ప్రకటన వచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు ఖరాఖండీగా చెప్తున్నారు.
2019 ఎన్నికలకు ముందు జగన్ కూడా తాను అధికారంలోకి వచ్చినా అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పారు. కానీ, ముఖ్యమంత్రి పీఠమెక్కాక ఆయన మాట మార్చారు. మూడు రాజధానులంటూ అమరావతి నడ్డి విరిచారు. దీంతో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు రోడ్లపైకి వచ్చారు.
ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందంటూ నిరసనలు తెలిపారు. 2019 డిసెంబర్ 17న మొదలైన ఈ నిరసనలు అప్పటి నుంచి నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 1200 రోజులైనా ఈ ఉద్యమం ఆగనే లేదు.
కరోనా తీవ్రంగా ఉన్న కాలంలో కూడా కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉద్యమం కొనసాగించారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో శిబిరాలు ఏర్పాటుచేసి నిరసనలు కంటిన్యూ చేశారు.
అనంతరం 2021 నవంబర్ 1న అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. అనంతరం ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తయిన తరువాత మరో మారు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు ప్రభుత్వం పెద్దఎత్తున ఆటంకాలు కల్పించింది. అయినా, యాత్ర కొనసాగిస్తూనే మధ్యలో కోర్టు అనుమతి తెచ్చుకుని చేస్తామంటూ యాత్రను నిలిపివేశారు. కోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకుని యాత్ర పూర్తిచేశారు.
అమరావతి భూములను అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం.. ఆర్5 జోన్ ఏర్పాటుకు అడుగులు వేస్తుండడంతో ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రైతులు పోరాటం తీవ్రం చేస్తున్నారు. తాజాగా ఉద్యమానికి 1200 రోజులు పూర్తవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలతో కలిపి రైతులు మందడంలో నిరసన సభ ఏర్పాటుచేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై తిరుబాటు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరు ఈ నిరసన సభలో పాల్గొననున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates