జగన్మోహన్ రెడ్డి తాజా ఢిల్లీ టూరుతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం పెరిగిపోతోంది. రెండువారాల వ్యవధిలో జగన్ రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడీ, అమిత్ షా తదితరులతో కలవమే ఇందుకు ప్రాధాన కారణం. తాజా టూరులో అమిత్ షా, నిర్మల సీతారామన్ తో భేటీ అయి తిరిగి వచ్చేశారు. అంటే కేంద్రంనుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వీలైనంత తొందరగా రాబట్టుకోవాలన్నదే జగన్ ఉద్దేశ్యంగా పార్టీలో టాక్.
తన ఆలోచనలను వివరించి ముందస్తు ఎన్నికలకు సహకరించమని ఇంతకుముందు మోడీని ఇపుడు అమిత్ షా ను జగన్ రిక్వెస్టు చేసినట్లు ప్రచారం పెరుగుతోంది. రెండువారాల క్రితం మోడీతో భేటీ అయిన తర్వాతే పెండింగ్ బకాయిల్లో రు. 5 వేల కోట్లు విడుదలైంది. ఇపుడు కూడా అలాగే బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలను కూడా కలిశారట. ఇవన్నీ పక్కనపెట్టేస్తే రాజకీయంగా ప్రతిపక్షాలను ఏకం కానీయకుండా చూడటం కూడా జగన్ టార్టెట్ లో కీలకమైనదని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ గెలవాలంటే టీడీపీ, జనసేన కలవకుండా చూడటమే జగన్ ముందున్న ఏకైక మార్గం. అయితే పై రెండుపార్టీలు పొత్తు పెట్టుకోకుండా ఆపటం జగన్ చేతిలో లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే పొత్తుల విషయాన్ని రెండుపార్టీలు తీరుబడిగా చర్చించి నిర్ణయం తీసుకుంటాయి. టీడీపీ, పీడీఎఫ్ కు జనసేన కూడా కలిస్తే మొన్నటి పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరు చూసిందే. మూడుస్ధానాల్లోను వైసీపీ ఓడిపోయింది.
అలాంటిది రేపటి ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలు, జనసేన కలిస్తే వాటిని అడ్డుకోవటం కష్టమని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. సో, వాటిని కలవకుండా చేయాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళటమే ఏకైక మార్గమని జగన్ భావనగా చెబుతున్నారు. ప్రతిపక్షాలు సెటిల్ అయ్యేందుకు సమయం ఇవ్వకూడన్నదే జగన్ ప్లానట. తన వ్యూహం వర్కవుటవ్వాలంటే ముందస్తు ఎన్నికలు మాత్రమే ఏకైక మార్గమని జగన్ కన్వీన్స్ అయినట్లు పార్టీనేతలు అంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.