హటాత్తుగా దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఆసక్తికరంగా మారుతుంది. విభజన సమస్యలపై హామీల అమలు.. పోలవరం.. తదితర అంశాలే ఎజెండా ఆయన ఢిల్లీ పర్యటన సాగుతున్నట్లుగా కథనాలు రావటం.. ఇదే అంశాల్ని ప్రముఖంగా పేర్కొంటూ ప్రకటనలు విడుదల కావటం తెలిసిందే. అయితే.. జగన్ ఢిల్లీ టూర్ల వెనుక అసలు ఎజెండా వేరే ఉందన్న మాట వినిపిస్తోంది.
ఉన్నట్లుండి ఢిల్లీ టూర్ ను డిసైడ్ చేసుకొని వెళుతున్న జగన్ అసలు లెక్కలు వేరే అన్న మాట వినిపిస్తోంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు.. తన బాబాయ్ వివేకా హత్య కేసులో సంచలన ఆరోపణలు ఎదుర్కొంటూ.. అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్న కడప ఎంపీ కమ్ తన సోదరుడైన అవినాశ్ రెడ్డి విషయంపై ఢిల్లీ నుంచి హామీ పొందేందుకు.. కేంద్ర నాయకత్వంతో తనకున్న దగ్గరతనంతో ఈ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడి.. ఊరట పొందేందుకు వీలుగా ఢిల్లీ పర్యటన సాగినట్లుగా చెబుతున్నారు. సీబీఐ కానీ తన సోదరుడ్ని అరెస్టు చేసిన పక్షంలో.. తనకు జరిగే డ్యామేజ్ అధికంగా ఉంటుందని.. ఈ విషయంలో కాస్తంత సానుకూలంగా వ్యవహరించేందుకు వీలుగా అభయహస్తాన్ని కోరేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు.
వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే ప్రతి సందర్భంలోనూ జగన్ ఢిల్లీకి వెళుతున్నారని.. ఆయన ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన కొంతకాలం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవటం లేదన్న విశ్లేషణలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజా ఢిల్లీ పర్యటనలో అవినాశ్ రెడ్డి అరెస్టు అంశంతో పాటు.. తాను టార్గెట్ చేసిన మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలోనూ కొంత ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు తాజా పర్యటన వెనుక అసలు కారణమన్న మాట వినిపిస్తోంది.
మార్గదర్శి చిట్ ఫండ్ లో మోసాలు.. ఆర్థిక నేరాలు భారీగా చోటు చేసుకున్నాయని.. ఈ విషయంలో విచారణ చేస్తున్న ఏపీ సీఐడీ జోరుగా విచారణ జరుపుతున్న వేళ.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ను కేంద్రానికి అందించేందుకు వీలుగా తాజా పర్యటన సాగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే మార్గదర్శి కేసులో కొన్ని బ్రాంచుల మేనేజర్లే అరెస్టు కావటం.. ఈ మధ్యనే బెయిల్ మీద విడుదల కావటం తెలిసిందే. తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్ కు ఆడిటర్లుగా వ్యవహరించే బ్రహ్మయ్య అండ్ కోకు సంబంధించిన కీలక ఆడిటర్ శ్రవణ్ ను అరెస్టు చేయటం.. ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ కుతరలించటం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకే ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన అంటున్నారు. ఈ వాదనలో నిజానిజాలు తేలాలంటే.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా ఒక అంచనాకు రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates