బస్టాండ్ సెంటర్లో సవాల్ విసిరిన మేకపాటి

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి ఓటేశారన్న ఆరోపణలతో వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గురువారం హల్ చల్ చేశారు. ఉదయగిరి వస్తే తనను తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ లీడర్ చేజర్ల సుబ్బారెడ్డికి ఊహించని సవాల్ విసిరారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో కుర్చీ వేసుకుని కూర్చుని దమ్ముంటే రమ్మంటూ సవాల్ విసిరారు. బస్టాండ్ సెంటర్లో కూర్చున్నాను.. దమ్ముంటే రా అంటూ ఆయన సవాల్ విసిరినా చేజర్ల సుబ్బారెడ్డి వర్గం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

అయితే… చంద్రశేఖర్ రెడ్డి జోరు చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రాజకీయ పోరు తీవ్రంగా ఉండడంతో మేకపాటి దగ్గరకు వ్యతిరేక వర్గీయులు ఎవరైనా వస్తే గొడవలు జరుగుతాయన్న ఆందోళనతో పోలీసులు వెంటనే అక్కడకు పెద్దసంఖ్యలో చేరుకుని మేకపాటిని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత బెంగలూరు వెళ్లిపోయిన మేకపాటి అక్కడి నుంచే తాను చెప్పాల్సింది చెప్పి ఊరుకున్నారు.

కానీ.. ఆయన నియోజకవర్గంలో మాత్రం వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారని.. ఎమ్మెల్యే ఆఫీసులోని ఫ్లెక్సీలు చించేసి రభస చేశారని.. ఆ నేపథ్యంలోనే మేకపాటి ఉదయగిరి వచ్చి ఇలా సవాల్ చేశారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మేకపాటి కూడా తన వ్యతిరేక వర్గీయులకు తీవ్రంగా హెచ్చరించారు. తనను వైసీపీ సస్పెండ్ చేసినా తాను ఇప్పటికీ ఉదయగిరికి ఎమ్మెల్యేనని.. తాను అధికారంలో ఉన్నప్పుడు తన కాళ్ల దగ్గరకు వచ్చినవారే ఇప్పుడు తనకు వార్నింగులు ఇచ్చేంత పెద్దోళ్లయ్యారా అంటూ ఆయన ఆగ్రహించారు. తాను వైసీపీలో లేకపోతే ఇప్పుడు వైసీపీ టికెట్ కోసం ఉదయగిరిలో కొట్టుకుంటారని, తాను ఎన్నికల వరకు హ్యాపీగా ఇదంతా చూస్తూ కూర్చుంటానని మేకపాటి అన్నారు.

కాగా పార్టీ సస్పెండ్ చేసినా ఏమాత్రం భయపడకుండా నియోజకవర్గానికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన మేకపాటి టెంపర్‌మెంట్ చూసి వైసీపీ స్థానిక నేతల నుంచి పెద్దల వరకు కంగారుపడుతున్నారట. వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి ఎవరిని బరిలో నిలిపినా మేకపాటి నుంచి గట్టి ప్రతిఘటన ఉంటుందని భావిస్తున్నారు. మేకపాటి యాటిట్యూడ్‌లో ప్రజల మూడ్ కనిపిస్తోందని.. వైసీపీపై వ్యతిరేకతను గమనించే మేకపాటి జోరు చూపిస్తున్నారని ఆ పార్టీ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది.