సాధారణ ఎమ్మెల్యే వెళ్తేనే ఆలయాల వద్ద ప్రత్యేక మర్యాదలు చేసి హడావుడిగా దర్శనాలు చేయిస్తారు. కానీ, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను మాత్రం గంట పాటు వెయిట్ చేయించారు. దాదాపు వారం కిందట జరిగిన ఈ ఇష్యూని అమర్నాథ్ మొదట లైట్‌గా తీసుకున్నా ఆ తరువాత అసలు సంగతి తెలిసి తెగ ఇబ్బంది పడిపోయారు. అందుకు కారణమైన అధికారికి స్థాన చలనం చేయించారు. అనకాపల్లి కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖ వైసీపీలో అందరి చెవులకూ చేరిపోయింది.
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా ఈ నెల 21న అమ్మవారి దర్శనానికి రావాలంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను ఆలయ మేనేజ్‌మెంట్ ఆహ్వానించింది. ఉగాది కావడంతో మంత్రి కూడా అదే రోజు సాయంత్రం ఆలయానికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కానీ, దర్శనం కోసం మాత్రం గంటకు పైగా వెయిట్ చేయించారు. ఆలయం శుద్ధి చేస్తున్నారని… అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారని చెప్పి చాలాసేపు వెయిట్ చేయించారు. అమ్మవారి కంటే తాను ఎక్కువేం కాదు కదా అని సర్దిచెప్పుకొని అంతసేపు నిరీక్షించి అనంతరం దర్శనం చేసుకున్నారు.
అయితే, ఆ తరువాత ఆయన చెవిన ఓ విషయం పడింది. అదేంటంటే.. నూకాంబిక ఆలయంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హవా పెరిగిపోయిందని.. ఆలయ ఈవో పూర్తిగా దాడి చెప్పినట్లు వింటున్నారని అమర్నాథ్‌కు తెలిసింది. ఆరా తీస్తే.. తనను వెయిట్ చేయించడం వెనుక కూడా దాడి ప్లాన్ ఉన్నట్లు ఆయన అనుమానించారు. దీంతో తన సహచరమంత్రి, దేవాదాయ శాఖ అమాత్యులు కొట్టు సత్యనారాయణకు అమర్నాథ్ కంప్లయింట్ చేశారు. వెంటనే ఈవో చంద్రశేఖర్‌కు బదిలీ జరిగిపోయింది. ఈ కారణంగా బదిలీ చేశారనిపించుకోకుండా మరో అధికారిని కూడా బదిలీ చేశారు.
దాడి వీరభద్రరావు వైసీపీలోకి వచ్చినప్పటికీ నుంచి అమర్నాథ్‌కు ఆయనకు పొసగడం లేదు. అధిష్టానం ఒక దశలో జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా కొన్నాళ్లకే మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్న దాడి వీరభద్రరావు వైపు పార్టీ పెద్దలు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. జగన్ వద్ద అమర్నాథ్‌కు రోజురోజుకూ పట్టు పెరుగుతుండడంతో ఆయనపై దాడి ఆగ్రహంగా ఉన్నారని.. అనకాపల్లి వైసీపీలో వీరిద్దరూ రెండు వర్గాలుగా రాజకీయం చేస్తుండడంతో పార్టీకి నష్టం జరుగుతోందని స్థానిక నేతలు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates