అక్కడ వైసీపీకి అభ్యర్థులు కావలెను?

వైసీపీ అనగానే ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేయడానికి రెడీగా ఉన్న నలుగురైదుగురి పేర్లు వినిపిస్తుంటాయి. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా అభ్యర్థి కానీ, సిటింగ్ ఎమ్మెల్యే కానీ ఈసారి గెలవరు అనుకుంటే వారికి ప్రత్యామ్నాయం కూడా సిద్ధంగానే ఉంటుంది. కానీ… ఏపీలోని ఒక నియోజకవర్గంలో మాత్రం వైసీపీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉండక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకోవడంతో ఆ ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వడానికి జగన్ ఏమాత్రం సుముఖంగా లేరు.

అయితే.. ప్రత్యామ్నాయంగా ఎవరికి ఇవ్వాలన్నా కూడా సరైన అభ్యర్థులు కనిపించడం లేదని.. ఆశావహులంటూ అధిష్టానానికి అందుతున్న పేర్లేవీ కూడా టికెట్ ఇవ్వడానికి తగిన అర్హతలు కలిగి లేవని అంటున్నారు… ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదా అనుకుంటున్నారు.. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం.

రెడ్డి శాంతి అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. పాలకొండ నియోజకవర్గానికి చెందిన రెడ్డి శాంతికి అక్కడ టికెట్ ఇచ్చినా గత ఎన్నికలలో జగన్ హావాలో ఆమె గెలిచారు. అయితే, భర్త, కుమార్తె ఉద్యోగరీత్యా ఆమె నిత్యం దిల్లీలోనే ఉంటుంటారు. పాతపట్నంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండేది చాలా తక్కువ. దీంతో స్థానిక నేత కాదన్నది బలంగా ప్రజల్లోకి వెళ్లింది. అదే అదనుగా ఆమెకు వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి. ఇటీవల కొద్దినెలల కిందట హిరమండలంలో ఆమె వ్యతిరేక వర్గం నేతలంతా సమావేశమై ఆమెకు మళ్లీ టికెట్ ఇస్తే సహకరించేది లేదని కూడా చెప్పేశారు.

ఇక రెడ్డి శాంతి పరిస్థితి ఏంటనేది గత జడ్పీ ఎన్నికలలోనే తేలిపోయింది. ఆమె కుమారుడు హిరమండలంలో జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కుమారుడు పోటీ చేసి ఓడిపోయినా ఆమె తీరు మారలేదని.. ప్రజల్లో తిరగడం లేదని చెప్తున్నారు. అయితే.. ఆమెకు టికెట్ ఇవ్వరాదని వైసీపీ పెద్దలు ఇప్పటికే నిర్ణయించుకున్నప్పటికీ ప్రత్యామ్నాయంగా బలమైన నేతలెవరూ కనిపించడం లేదు. టీడీపీ నుంచి కలమట వెంకటరమణ పోటీ చేయనుండడంతో ఆయనపై గెలవాలంటే ఆర్థికంగా, రాజకీయంగా పట్టున్న నేతలు అవసరం. రెడ్డి శాంతి ఆర్థికంగా బలవంతురాలైనప్పటికీ ఆమెకు సొంత పార్టీలోనే సహకారం కరవైంది. అలా అని వేరే అభ్యర్థులూ ఎవరూ లేక వైసీపీ అక్కడ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది.