ఎంపీ చెప్పిన ‘ముందస్తు’ జోస్యం 

రానున్న నవంబర్, డిసెంబర్లో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమట. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో జోస్యం చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతు తెలంగాణాలో డిసెంబర్లో జరగబోయే ఎన్నికలతోనే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు చెప్పారు. తాజా ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడీ, అమిత్ షా తో ఈ విషయం మాట్లాడటానికే వచ్చుంటారని ఎంపీ అనుమానం వ్యక్తంచేశారు.

మోడీ, అమిత్ షా తో భేటీపై అధికార పార్టీ పైకి చెప్పే కారణాలు వేరు, లోపల మాట్లాడుకునే మాటలు వేరే ఉంటాయన్నారు. రాష్ట్రంలో పడిపోతున్న పార్టీ  గ్రాఫ్ విషయంలో జగన్ లో ఆందోళన పెరిగిపోతోందట. ఈ గ్రాఫ్ మరింతగా పడిపోకముందే ముందస్తు ఎన్నికలకు వెళిపోతే పార్టీకి కొన్ని సీట్లయినా వస్తుందన్నది జగన్ ఆలోచనగా ఎంపీ తేల్చేశారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ప్రభావం తమ పార్టీపైన బాగా తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు.

అందుకనే రాబోయే ఎన్నికల్లో వివేకా మర్డర్ కేసు తమ పార్టీపైన పడకుండా మ్యానేజ్ చేసుకోవడం కూడా జగన్ అజెండాలో ఒక భాగమన్నారు. మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపైన సీబీఐ  ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపేందుకు మోడీని జగన్ రిక్వెస్టు చేస్తున్నట్లు ఎంపీ ఆరోపించారు. అవినాష్ రెడ్డి జైలుకు వెళినా అంతిమ విచారణ తనదాకా రాకుండా ఉండేట్లు జగన్ తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారట.  

ఇదే సమయంలో మర్డర్ కేసులో తాను అనుకుంటున్న వారిని సీబీఐతో అరెస్టు చేయించేందుకు కూడా జగన్ కేంద్రంలోని పెద్దలను రిక్వెస్టు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఇలాంటి చాలా విషయాలను చెప్పిన ఎంపీ రాబోయే ఎన్నికల్లో తమపార్టీకి ఘోర పరాజయం తప్పదని తేల్చేశారు. ఒకసారి 15 సీట్లొస్తే ఎక్కువని చెప్పిన ఎంపీ మరోసారి 60 సీట్లవరకు వచ్చే అవకాశముందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజా సమావేశంలో మాత్రం ఘోరపరాజయం తప్పదన్నారే కానీ ఎన్నిసీట్లకు పరిమితం అవుతుందన్నది మాత్రం  మాత్రం చెప్పలేదు. మరి ఎంపీ జోస్యం నిజమవుతుందా ?