వైసీపీపై బాల‌య్య హాట్ కామెంట్స్‌

తెలంగాణ‌లో తాజాగా నిర్వ‌హించిన టీడీపీ ఆవిర్భావ స‌ద‌స్సులో న‌టుడు, అన్న‌గారి కుమారుడు నంద మూరి బాల‌కృష్ణ హాట్ కామెంట్లు చేశారు. టీడీపీ స్థాపించ‌క‌పోతే.. తెలుగు వారు ఢిల్లీకి దాసోహం చేయాల్సి వ‌చ్చేంద‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ప్ర‌తినాయ‌కుడు.. టీడీపీ గూటి నుంచి ఎగిరిపోయిన ప‌క్షే.. అని సంచ‌లన కామెంట్లు చేశారు. ఇక‌, టీడీపీ స్థాపించి.. అనతికాలంలోనే అధికారం చేపట్టి తెలుగువాడు ఎక్కడున్నా సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత అన్న‌గారు ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు.

పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఎస్సీ రీజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేన‌ని తెలిపారు. ఎన్టీఆర్ పాలనలో పేదలకోసం ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారన్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగువారందరిని ఏకతాటిపై తెచ్చి అనతికాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లు, మహిళలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రజల వద్దకే పాలన తెచ్చిన గొప్పవ్యక్తి అన్నారు. సహకార వ్యవస్థలో సింగల్ విండో విధానం తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. గురుకుల విద్యా బోధన, సంక్షేమ హాస్టళ్లు తీసుకువచ్చారని వివ‌రించారు.

అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని బాల‌య్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పాల‌న‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల‌ని బాల‌య్య పిలుపు నిచ్చారు. మొత్తానికి సినిమా డైలాగుల‌తో బాల‌య్య దంచికొట్టిన స్పీచ్‌కు పార్టీ కార్య‌క‌ర్తల నుంచి మంచి రెస్పాన్స్ ల‌భించింది.