గొడ్డలి, గన్, గంజాయి…

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడేం జరుగుతోంది. పాలన ఎలా ఉంది.. పైకి వెళ్తోందా.. కిందకు వెళ్తుందా.. ఇలాంటి ప్రశ్నలకు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పారు. తెలుగుదేశం 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభకు భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. బాలయ్య మార్క్ ప్రసంగం తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు గంటన్నర పాటు మాట్లాడారు.

జగన్ ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు. రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గొడ్డలి, గన్,గంజాయి రాజ్యమేలుతున్నాయన్నారు. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికారని చంద్రబాబు గుర్తు చేశారు. మంగళవారమే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో గన్ కల్చర్ కనిపించిందన్నారు.

వివేకా హత్యకేసులో విచారణను ఎదుర్కొన్న వ్యక్తి కాల్పులు జరిపితే ఒకరు చనిపోయారన్నారు. అదీ రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం గంజాయి ప్రదేశ్‌గా మారిందన్నారు. గంజాయి రవాణాలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిందన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే తెలుగు దేశం రావాలన్నారు. సైకోను వదిలించుకుని సైకిల్‌కు ఓటేసే రోజు ఎంతో దూరం లేదన్నారు.

సంపదను సృష్టించి ఆ సంపదను పేదవాళ్లకు పంచి పెట్టే ప్రక్రియ అవసరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సహాయపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్‌కు, దేశానికి అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల జీవితాలను మార్చేది రాజకీయమని చంద్రబాబు గుర్తు చేశారు.