టీడీపీకి చేరువ‌వుతున్న బీజేపీ! తాజా అప్డేట్ ఇదే..

అదేంటి అనుకుంటున్నారా?  ఔను. నిజ‌మే. రాజ‌కీయాల్లో శాశ్వత శత్రువులు ఉండ‌రు అంటారు క‌దా! అలానే ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీకి చేరువ అవుతోంది. వాస్త‌వానికి ఒక‌ప్పుడు.. అంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా బీజేపీ కి చేరువ‌య్యేందుకు టీడీపీ ప్ర‌య‌త్నించింది. కానీ, ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ప‌డింది. దీంతో ఆ పార్టీనే టీడీపీకి  చేరువ అవుతోంది.

తాజాగా టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.  పార్లమెంటు సెంట్ర‌ల్ హాల్‌లో ఉన్న‌ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర‌కుమార్‌ నిర్వహించారు. కేక్ కట్ చేసి ఇతర పార్టీల ఎంపీలకు  అందజేశారు. ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో జేపీ నడ్డా సైతం అక్కడకు చేరుకున్నారు.

టీడీపీ ఎంపీలకు ఆయ‌న అభినందనలను తెలియజేశారు. వాజ్ పేయి, ఎన్‌డీఏ హయాంలో టీడీపీ- బీజేపీల మధ్య అనుబంధాన్ని ఎంపీ కనకమేడల.. నడ్డాకు వివరించారు. అయితే తనకు టీడీపీతో స్నేహ సంబంధాల గురించి తెలుసని నడ్డా పేర్కొన్నారు. టీడీపీకి ఎంతో ఫ్యూచ‌ర్ ఉంద‌ని కూడా న‌డ్డా వ్యాఖ్యా నించారు. క‌న‌క మేడ‌ల అందించిన కేక్ ముక్క‌ను తిన‌డ‌మే కాకుండా.. అన్న‌గారికి ఆయ‌న కూడా పూలు స‌మ‌ర్పించి.. నివాళుల‌ర్పించారు.

కాగా, ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ పొత్తుపైనా నడ్డా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తమ అభ్యర్ధుల విజయంపైనా సైతం ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఇక‌, త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ టీడీపీ సాయం తీసుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయ‌ని స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.