సజ్జలపై వేటుకు జగన్ రెఢీ?

వైవీ సుబ్బారెడ్డి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. మైసూరా రెడ్డి. విజయసాయి రెడ్డి. సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఈ పేర్లు చదివినప్పుడు కొన్ని సారూపత్యలు కనిపిస్తాయి. నిజమే.. ఈ నేతలంతా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారే. అంతకు మించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నీ తామైనట్లుగా ఒక దశలో వ్యవహరించిన వారే. అదే సమయంలో.. అదంతా కొంతకాలమే. ఒక్కో సీజన్ లో ఒక్కొక్కరు అన్న చందంగా.. ఒకరి తర్వాత ఒకరిని తన సన్నిహితుడి స్థానాన్ని ఇచ్చేయటం జగన్ కు అలవాటుగా చెబుతారు.

పార్టీలో తన తర్వాతి స్థానం ఇచ్చే విషయంలో జగన్ ఒక విధానాన్ని ఫాలో అవుతుంటారని చెబుతారు. ఆ స్థానాన్ని ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారన్న పేరుంది. అందుకు తగ్గట్లే.. ఆయనకు ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించి.. ఆ తర్వాత దూరమైన వారి జాబితాలోనే వైవీ మొదలుకొని విజయసాయి వరకు ఉంటారని చెప్పాలి. విజయసాయి తర్వాత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మారింది సజ్జల రామక్రిష్ణారెడ్డినే.

ఒక విధంగా చెప్పాలంటే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు అత్యంత సన్నిహితుడిగా.. నమ్మకస్తుడిగా ఎక్కువ కాలం నడిచిన వ్యక్తి సజ్జల అని చెబుతారు. అలాంటి ఆయనపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం తెలిసిందే. అన్నింటికి మించి.. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణమైన ఎదురుదెబ్బలు తగిలి వైసీపీ విలవిలలాడిపోతున్న వైనం తెలిసిందే.

ఈ మొత్తానికి కారణం అధినేత జగన్మోహన్ రెడ్డి అని ఒక్కరుఅనకుండా.. అందరూ మూకుమ్మడిగా సజ్జల పేరును ప్రస్తావిచంటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సజ్జలపైన సీఎం జగన్ కినుకుతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్లో అందరి నోటి నుంచి సజ్జల పేరు రావటం.. పార్టీకి దూరమవుతున్న వారంతా సజ్జల పేరును ప్రస్తావించి.. ఆయనపై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేయటాన్ని జగన్ పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతానికి స్టేటస్ కోను మొయింటైన్ చేస్తున్నప్పటికీ అదెక్కువకాలం ఉండదన్నమాట వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సజ్జల స్థానం మారే అవకాశమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన సన్నిహితుడి స్థానాన్ని ఎప్పటికప్పుడు మార్చే అలవాటు ఉన్న జగన్.. తనకు అలవాటైన పని చేసే వీలుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.