తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీ మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినట్లే అనిపిస్తోంది. ఏదోరోజు మిత్రపక్షాలు విడిపోక తప్పదన్న విషయం కమలనాదులకు అర్ధమైపోయినట్లుంది. ఇంతకాలం ఏదో మూలన జనసేనపై చిన్న ఆశ ఉన్నట్లుంది. అందుకనే అవకాశం దొరికినపుడల్లా జనసేన తమ మిత్రపక్షమే అని చెప్పింది. ఇపుడిక విడిపోక తప్పదని నిర్ధారణ చేసుకున్నట్లుంది. అందుకనే జనసేన తమను మోసంచేసిందని బహిరంగంగా ఆరోపణలకు దిగింది. తాజాగా 163 నియోజకవర్గాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించింది.
175 నియోజకవర్గాల్లో 163 చోట్ల కన్వీనర్లను నియమించిందంటే అర్ధమేంటి ? ఒంటరిపోటీ తప్పదని మానసికంగా సిద్ధమైపోతున్నట్లుంది. పొత్తులున్నా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అన్నీ నియోజకవర్గాల్లో కన్వీనర్లను నియమించుకోవచ్చు. కానీ ఇపుడు నియమించిన కన్వీనర్లే రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులవుతారనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇక్కడే రాబోయే ఎన్నికల్లో ఒంటరిపోటీ తప్పదని నాయకత్వానికి అర్ధమైపోయిందని కమలనాదులు అనుకుంటున్నారు.
అన్నీ నియోజకవర్గాల్లోను పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రెడీ అవుతోందని అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించారు. నియోజకవర్గ కేంద్రంనుండి గ్రామస్ధాయి వరకు పోలింగ్ బూత్ వారీగా నేతలు, కార్యకర్తలను నియిమించబోతున్నట్లు చెప్పారు. షెడ్యూల్ ఎన్నికల్లోగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుని రెడీగా ఉండాలని వీర్రాజు చెప్పారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో చేపట్టబోతున్న ఆందోళనలు చేయబోతున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో జనసేనను కలుపుకుని వెళ్ళాలని పార్టీ నాయకత్వం చెప్పలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఏ సందర్భంలో కూడా బీజేపీతో కలిసి వెళ్ళాలని చెప్పటంలేదు. ఎంతసేపు టీడీపీతో పొత్తు విషయమే మాట్లాడుతున్నారు. దీంతో బీజేపీ నేతలకు విషయం బాగా అర్ధమైపోయింది. అందుకనే వేరుకుంపటి పెట్టుకునేందుకు మానసికంగా సిద్ధపడిపోతున్నారు. అందుకనే కన్వీనర్లు, కో కన్వీనర్లు, బూత్ కమిటీలని, గ్రామకమిటీలని చాలా స్పీడుగా నియామకాలు చేసేస్తోంది. విచిత్రం ఏమిటంటే రెండుపార్టీల్లోను తెలుసు వచ్చేఎన్నికల్లో కలిసి పోటీచేసే అవకాశాలు దాదాపు లేవని. అయినా ఇంతకాలం మిత్రత్వ ఉందని నటిస్తున్నారంతే. అలాంటిది ఎంఎల్సీ ఎన్నికల్లో పవన్ వైఖరి తేలిపోవటంతో బీజేపీ తన దారి తాను చూసుకుంటోందంతే.
Gulte Telugu Telugu Political and Movie News Updates