సీఎం ఢిల్లీ టూర్లు..తగ్గుతున్న సీబీఐ జోరు..

jagan

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. పక్షం  రోజులు తిరగకముందే ఆయన హస్తిన  బాట పడుతున్నారు. విశాఖలో జీ-20 సదస్సు ఉన్నప్పటికీ  ఆయన ప్రత్యేకంగా  ఢిల్లీ  వెళ్తున్నారు.మనం  పక్క వీధికి వెళ్లినంత సులభంగా జగన్ హస్తినకు చేరుకుంటున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనలపై అనేక ఊహాగానాలు, విమర్శలు తలెత్తున్నాయి. గత సారి  ఆయన ఢిల్లీ వెళ్లిన తర్వాతే వివేకా కేసులో సీబీఐ దూకుడు తగ్గించిందని కొందరు విశ్లేషిస్తున్నారు..

ఈ నెల 16,17 తేదీల్లో జగన్ ఢిల్లీలో ఉన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా కోసం ఆయన ఢిల్లీ వెళ్లినట్లు అప్పట్లో వైసీపీ నేతలు బాకా  ఊదుకున్నారు. తీరా చేస్తే ఇంతవరకు ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఒక స్టేట్ మెంట్ రాలేదు. పోలవలం ఎత్తు, నిల్వ  సామర్థ్యంపై కేంద్రమే రెండు విరుద్ధమైన ప్రకటనలు చేసింది. ఇప్పుడు ఢిల్లీ పర్యటనపై కూడా వైసీపీ నేతలు పాడిందే పాటరా పాచి పళ్ల దాసా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 

గత సారి జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు అవినాశ్ రెడ్డి కుటుంబంపై సీబీఐ పూర్తి స్థాయి దూకుడును ప్రదర్శిస్తూ ఉంది. ఏ క్షణమైనా అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం  ఉందని హైకోర్టు ముందు  ప్రకటించింది. వాళ్లిద్దరూ అనుమానితులు మాత్రమే అయినప్పటికీ వారిపై బలమైన సాక్ష్యాధారాలున్నాయని  ప్రకటించింది. జగన్ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఇంతవరకు వివేకా కేసులో సీబీఐ విచారణ ఒక అడుగు కూడా ముందుకు సాగలేదు. కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ సీబీఐ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. జగన్ ఢిల్లీ టూరుకు దానికి లింకు ఉందని చెబుతున్నారు. 

ఇప్పుడు మళ్లీ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు  బెయిల్ పిటిషన్ వేశారు. అయితే  సుప్రీం  కోర్టులో ఉన్న పిటిషన్ విచారణపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. సరిగ్గా అవినాష్ పిటిషన్ వేసిన రోజే జగన్  ఢిల్లీ టూర్ ఖరారైంది గురువారం ఆయన  ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలుసుకునే వీలుందని అంటున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు సార్లు ప్రశ్నించిన  నేపథ్యంలో కేసును పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ టూర్ పై రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వైసీపీకి ఘోర పరాజయం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే తమకు కష్టమేనని వైసీపీ వర్గాలు అంచనా  వేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు పూర్తి స్థాయిలో కలిసే లోపే ముందుస్తు ఎన్నికలకు వెళ్లి వారిని  ఆశ్చర్య పరచాలని జగన్ అనుకుంటున్నారట.గత  సారి ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా మోదీ వద్ద  ముందస్తు ప్రస్తావన తీసుకురాగా.. మీ ఇష్టం, మీరే ఆలోచించుకోండని ఆయన నుంచి సమాధానం వచ్చింది. ఈ సారి జగన్  కాస్త డిఫరెంట్ గా ఆ విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నట్లు వైసీపీ నుంచి లీకులు  వస్తున్నాయి.  ఒక టైమ్ చెప్పి ఆ టైమ్  లోపు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని జగన్ అడగబోతున్నారట. దానికి మోదీ సమాధానం ఎలా ఉంటుందో చూడాలి..