కొత్తగూడేనికి కొత్త నాయకుడొస్తారా?

కోవిడ్ టైంలో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఆయన ఇప్పుడు చట్టసభలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు కాళ్లు మొక్కడం నుంచి హరీశ్ రావుకు అహర్నిశలూ భజన చేయడం వరకు ఎక్కడా తగ్గడం లేదు. అయితే.. ఈ ప్రయత్నాలలో ఆయన మిగతా టీఆర్ఎస్ నేతలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కొందరు ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తోంది. తాజాగా ఆయన కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడిన మాటలపై వనమా నాగేశ్వరరావు వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు రీసెంటుగా హరీశ్ రావును ఆకాశానికెత్తేస్తూ ఆయన సిద్ధిపేటలో చేసిన అభివృద్ధి గురించి తెగ పొగడ్తలు కురిపించారు. అయితే, ఈ క్రమంలో ఆయన సిద్ధిపేటను కొత్తగూడెం నియోజకవర్గాన్ని పోల్చారు. సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధి 50 శాతమైనా కొత్తగూడెంలో జరిగి ఉంటే బాగుంటేందంటూ రెండు నియోజకవర్గాలను పోల్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీనివాసరావు తీరుపై మండిపడుతున్నారు. హరీశ్ రావు తప్ప ఇతర నేతలు తమ తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం లేదా? శ్రీనివాసరావు ఉద్దేశమేంటి అంటూ ఆగ్రహిస్తున్నారు.

ఎమ్మెల్యే సీటు కావాలంటే కేసీఆర్‌ను అడిగి తెచ్చుకోవాలే కానీ ఒక అధికారిగా ఉంటూ పార్టీ నేతలను తక్కువ చేసి మాట్లాడడం కరెక్టు కాదంటున్నారు. ముఖ్యంగా కొత్తగూడెం బీఆర్ఎస్ నేతలను శ్రీనివాసరావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్కడి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వర్గీయులు దీనిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

శ్రీనివాసరావు కొన్నాళ్లుగా కొత్తగూడెం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఆయన కొత్తగూడెం విషయంలో పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం ప్రాంతంలో ఎన్నో సహజవనరులున్నా 5 దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదని గతంలో ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తనకు హెల్త్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారని.. ఆయన ఆశీర్వదిస్తే ఎలాంటి పదవి చేపట్టి ప్రజలకు సేవచేయడానికైనా సిద్ధంగా ఉన్నానని గతంలో ఆయన అన్నారు.

ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, ఆయన కుమారుడు వనమా రాఘవ వ్యవహారాలతో ఆయన అప్రతిష్టపాలు కావడంతో ఈసారి టికెట్ తనకు ఇవ్వాలంటూ గడల శ్రీనివాసరావు కోరుతున్నట్లు సమాచారం.