నందిగం సురేశ్ ఫ్యూచర్ ఏంటి?

బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. భారీ మెజారిటీతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు 2024 ఎన్నికల నాటికి డీలా పడుతుండడంతో వ్యూహాలు మారుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టీడీపీ బలం పుంజుకుంటున్న సెంట్రల్ ఆంధ్రలో పెద్దఎత్తున మార్పులకు తెరతీస్తున్నట్లు చెప్తున్నారు. 2019లో పోటీ చేసిన ఎంపీలలో చాలామంది ఈసారి పార్లమెంటుకు పోటీచేయకపోవచ్చని చెప్తున్నారు.

ఆ లిస్టులో వినిపిస్తున్న పేర్లలో నందిగాం సురేశ్ కూడా ఒకటి. బాపట్ల నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన జగన్‌కు చాలా సన్నిహితుడు. ఇటీవల వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రేదేవికి, ఎంపీ నందిగాం సురేశ్‌కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బయటకు పంపించడానికి ముందే ఆమెకు వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కదని జగన్ చెప్పినట్లు వైసీపీ వర్గాలలో టాక్. ఈ నేపథ్యంలో తూళ్లూరుకు చెందిన నందిగం సురేశ్‌ను వచ్చే ఎన్నికలలో తాటికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంపైనా సురేశ్ ఆసక్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబు విషయంలో జగన్ ఏమంత సంతృప్తిగా లేరన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో టీడీపీపై దూకుడు ప్రదర్శించడంతో సుధకర్ బాబు కొంత మార్కులు కొట్టేసినప్పటికీ జగన్ ఇంకా ఆయన విషయంలో సానుకూలంగా లేరనే చెప్తున్నాయి వైసీపీ వర్గాలు. ఈ నేపథ్యంలోనే సురేశ్ సంతనూతలపాడుపైనా కన్నేసినట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో కొనసాగుతున్న ఆదిమూలపు సురేశ్ 2014లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయనకు, నందిగం సురేశ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. తాటికొండ నియోజకవర్గంలో అత్యధిక ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండడంతో అక్కడ పోటీ చేసేందుకు నందిగం సురేశ్ వెనుకాడుతున్నారని టాక్. ఆయన సంతనూతలపాడుపైనే ఇంట్రెస్ట్‌గా ఉన్నారని.. ఆదిమూలపు సురేశ్‌ కూడా ఆయనకు వత్తాసుగా ఉన్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

సంతనూతలపాడు నుంచి నందిగం సురేశ్ అయితే సరైన అభ్యర్థి అంటూ ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే జగన్ చెవికొరుకుతున్నారని టాక్. ఆదిమూలపు ప్రస్తుత నియోజకవర్గం ఎర్రగొండ్లపాలెం నుంచి కొనసాగుతూ సంతనూతలపాడుకు నందిగం సురేశ్‌ను సజెస్ట్ చేస్తున్నారట. మరి జగన్ మనసులో ఏముందో ఆయన ఏం చేస్తారో ఎన్నికల వరకు తెలిసే చాన్స్ లేనే లేదు.