ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైనట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కావడంతో వైసీపీ మంత్రులలో టెన్షన్ మొదలైంది. అదేసమయంలో మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఆశలు చిగురిస్తన్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండడంతో ఈలోగా అమాత్యులు అనిపించుకోవాలని చాలామంది ఆశపడుతున్నారు. అయితే… ప్రస్తుత కేబినెట్లో ఎంతమందిని జగన్ తప్పిస్తారు.. కొత్తగా ఎంతమందికి అవకాశం ఇస్తారనే విషయంలో పార్టీలోనే పరిపరివిధాలుగా వినిపిస్తోంది. ముగ్గురు మంత్రులు స్థానం కోల్పోనున్నారని కొందరు చెప్తుండగా.. అయిదుగురు మంత్రులను తప్పించడానికి జగన్ సిద్ధమయ్యారని మరో వాదన కూడా వైసీపీ నుంచి వినిపిస్తోంది.
మంత్రివర్గ విస్తరణ కోసమే జగన్ గవర్నర్‌ను కలిశారని తెలుస్తోంది. మండలి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉండొచ్చంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. ఆశించిన స్థాయిలో పనితీరును కనపర్చని మంత్రులను జగన్ సాగనంపుతారని, వారి స్థానంలో మండలి ఎన్నికల్లో గెలిచిన వారికి అవకాశం కల్పిస్తారనే అభిప్రాయాలు వెలువడ్డాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో జగన్ భేటీ అయిన నేపథ్యంలో- ఈ నెల 30 లేదా 31వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రివర్గ ప్రక్షాళనలో ముగ్గురు నుంచి అయిదుమంది వరకు ఉద్వాసన తప్ప దంటున్నారు. వారి ప్లేస్ లో కొత్తవారికి స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది ఉత్కంఠతను రేపుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూడా వైఎస్ జగన్ ఈ దిశగా సంకేతాలను పంపారు…నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయిలో అందిన నివేదికల ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగన్ ఆ ప్రాంతంలోని మంత్రులను మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు.
అదేసమయంలో కొత్తగా మంత్రి పదవి దక్కించుకునేవారిలో మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు పేర్లు వినిపిస్తున్నాయి. ఉండవల్లి శ్రీదేవి ఇష్యూ నేపథ్యంలో డొక్యా మాణిక్య వరప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. రాయలసీమ ప్రాంతం నుంచి పదవులు దక్కించుకుంటారంటూ పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నా స్పష్టత రాలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates