టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర హాఫ్ సెంచరీ కొట్టింది. యాభై రోజుల తర్వాత కూడా లోకేష్ అదే ఊపులో నడుస్తుంటే లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట నడుస్తున్నారు. పీలేరు పాదయాత్ర సందర్భంగా లోకేష్ చేసిన భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. దీనితో లోకేష్ మరోమారి దీన్ని ప్రస్తావించారు.
పీలేరు భూఆక్రమణలపై సీబీఐ లేదా సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని నేరుగా ముఖ్యమంత్రి జగన్ కు లోకేష్ లేఖ రాశారు. భూ ఆక్రమణల ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని లోకేష్ అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ మాఫియా దందా చేస్తోందని, అందులోనూ పీలేరు నియోజకవర్గంలో మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని లోకేష్ అంటున్నారు.
మొత్తం 601.37 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు మదనపల్లి సబ్ కలెక్టర్ సవివర నివేదిక సమర్పించారని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పోరాటంతో చిత్తూరు కలెక్టర్ పీలేరులోని డీకేటీ భూములు, ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాపై 2021లోనే విచారణ చేయించారని గుర్తు చేశారు. పీలేరులోని భూ కుంభకోణంపై సిఐడి లేదా సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీకి చెందిన పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గతంలో శాసనసభలో కోరిన సంగతిని లోకేష్ గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కబ్జాదారులకు కొమ్ము కాస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది..
రాష్ట్రంలో భూమాఫియాకు వ్యతిరేకంగా తెలుగుదేశం నిరంతర పోరాటం కొనసాగిస్తుందని లోకేష్ వెల్లడించారు. తమ ఫిర్యాదులపై చర్యలకు కలెక్టర్ సహా అధికారులందరూ సిద్ధమవుతున్నప్పటికీ, కొన్ని అదృశ్య శక్తులు వారికి అడ్డం పడుతున్నాయన్నారు. నిజంగా దమ్మున్న ప్రభుత్వమైతే ప్రతి ఆరోపణపై విచారణ జరపాలని లోకేష్ డిమాండ్ చేశారు….